Telugu Global
National

జరిమానా కట్టేసింది... శశికళ  జైలు నుంచి వచ్చేస్తోంది...

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ త్వరలో జైలునుంచి విడుదల కాబోతున్నది. జనవరి 27న ఆమె జైలు నుంచి బయటకు రానున్నది. అయితే ఇప్పటికే ఆమె తనకు విధించిన రూ. 10.10 కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించేశారు. అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె బంధువులకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించింది. 2017 ఫిబ్రవరి 15 నుంచి శశికళ బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శశికళ […]

జరిమానా కట్టేసింది... శశికళ  జైలు నుంచి వచ్చేస్తోంది...
X

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ త్వరలో జైలునుంచి విడుదల కాబోతున్నది. జనవరి 27న ఆమె జైలు నుంచి బయటకు రానున్నది.

అయితే ఇప్పటికే ఆమె తనకు విధించిన రూ. 10.10 కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించేశారు. అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె బంధువులకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించింది. 2017 ఫిబ్రవరి 15 నుంచి శశికళ బెంగళూరు పరపన అగ్రహారం జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శశికళ రాక ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కాక రేపుతోంది. సత్ర్పవర్తన, పెరోల్​ను అధికంగా వినియోగించుకోకపోవడం తదితర కారణాలతో ఆమె జైలుశిక్ష తొందరగా పూర్తవుతున్నట్టు సమాచారం.

శశికళ ఎప్పుడు విడుదల అవుతారనే విషయం తెలపాలని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆర్​టీఐ చట్టం కింద కర్ణాటక జైళ్ల శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే శశికళ డిసెంబర్​లోపు జరిమానా చెల్లిస్తే ఆమె జనవరి 27న విడుదలవుతారని జైలు అధికారులు సమాధానం చెప్పారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివప్పా సమక్షంలో శశికళ తరఫు న్యాయవాది రూ. 10.10 కోట్ల జరిమానాను కోర్టుకు కట్టారు. దీంతో ఆమె విడుదలకు మార్గం సుగమమైంది.

అయితే శశికళ ఒక్కసారిగా రూ. 10.10 కోట్లు జరిమానాగా చెల్లిస్తుండటంతో ఆదాయపు పన్నుశాఖ ఆమె మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శశికళ తరఫు న్యాయవాదులు పక్కా పత్రాలు, లెక్కలతో ఈ డబ్బును కోర్టుకు సమర్పించినట్టు సమాచారం. శశికళకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు. వారి బ్యాంకు వివరాలు, ఆదాయ వివరాలను కూడా ఎంతో పక్కాగా కోర్టుకు సమర్పించారు న్యాయవాదులు.. పళనివేళ్​ అనే వ్యక్తి స్టేట్​బ్యాంక్​ నుంచి రూ. 3.25 కోట్లు, వసంతదేవి అనే మహిళ రూ. 3.75 కోట్లు, హేమ అనే మహిళ యాక్సిస్​ బ్యాంక్​ నుంచి రూ. 3 కోట్లు. వివేక్​ అనే వ్యక్తి రూ. 10వేలు డీడీల రూపంలో ఈ డబ్బును పంపించారు.

కాగా శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో ఏమేరకు మార్పులు చోటు చేసుకుంటాయన్న దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తున్నది. జయలలిత మరణం తర్వాత శశికళే అన్నాడీఎంకేకు అధి నాయకురాలిగా వ్యవహరిస్తారని.. ఆమే తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి గద్దె నెక్కగా.. అవినీతి కేసులో ఇరుక్కొని శశికళ జైలుకు వెళ్లారు.

అయితే శశికళ కొంతకాలం పాటు జైల్లో ఉన్నప్పటికి పార్టీలో పట్టు నిలుపుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె క్రమంగా పార్టీ పట్టు కోల్పోయారు.

పోటీకి రంగం సిద్ధం..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శశికళ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. దీనికి సంబంధించి ఆమె తన న్యాయవాది రాజా చెందూర్‌ పాండియన్‌కు రాసిన లేఖ వెలుగు చూసింది. ఇందులో ఆమె ఇచ్చిన సూచన ఆధారంగా సుప్రీంకోర్టులో కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుకు కసరత్తులు సాగుతుండడం గమనార్హం.

నాలుగేళ్లు జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆమెకు లేదు. దీంతో తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్‌ పిటిషన్‌ దాఖలుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన వ్యూహాలకు శశికళ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది. అక్రమాస్తుల కేసు విచారణ ఒకే కోణంలో జరిగినట్టు, అన్ని కోణాల్లో పరిశీలించి విచారణ జరగాలని, అలాగే, శిక్ష విషయంలో పునస్సమీక్షించేందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు వ్యూహరచన జరుగుతున్నట్టు సమాచారం.

శశికళ ప్రతినిధి దినకరన్, న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌ ఢిల్లీలోని న్యాయవాదులు, న్యాయ ప్రతినిధులతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నారు. ఈ సారి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ తరపున ఆమె అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులని నిలిపి పోటీచేయనున్నట్టు సమాచారం.

మాకేం నష్టం లేదు..!

శశికళ విడుదలపై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. శశికళ బయటకు వచ్చినా అన్నాడీఎంకే పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు చెందిన నేతలెవరైనా పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మరోవైపు తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్​ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, తమిళనాడు అగ్ర నేతలుగా వెలిగిన కరుణానిధి, జయలలిత లేకపోవడంతో ఆ శూన్యతను స్టాలిన్​ భర్తీచేస్తారని పలువురు రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు స్టాలిన్​ సోదరుడు అళగిరి సొంతంగా ఓ రాజకీయపార్టీ పెట్టబోతున్నారని.. దానికి బీజేపీ పెద్దల సహకారం ఉందని తమిళనాడులో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సారి తమిళనాడులో రాజకీయం మరింత రసకందాయంగా మారింది.

First Published:  18 Nov 2020 9:18 PM GMT
Next Story