నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్ళినా… హయత్ హోటల్ కు వెళ్ళినా మాకు భయంలేదు – మంత్రి కన్నబాబు

విశాఖ అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని విశాఖ జిల్లా ఇన్ చార్జి మంత్రి కన్నబాబు మీడియా సమావేశంలో వివరించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారుతున్న తరుణంలో ఆ ప్రాంతం అన్నివిధాల అభివృద్ధి కావాలని జగన్ ఆకాంక్ష అని చెప్పారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు బకాయి ఉన్న రూ.900కోట్లను తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామని, నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలకోసం పారిశ్రామిక విధానం రూపొందించామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవాటిని చెప్పినట్టు అమలు చేసే ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు మంత్రి కన్నబాబు.

ఎన్నికలకు తాము భయపడుతున్నామని అనడానికి టీడీపీ నేతలకు సిగ్గుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలు చంద్రబాబుకి వంగి వంగి సలాం చేస్తున్నాయని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్ళినా.. హయత్ హోటల్ కు వెళ్ళినా తమకు భయంలేదన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ… గడువు తీరినా కూడా అప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదని గుర్తు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉందని చెప్పుకుంటున్న రమేష్ కుమార్ అప్పుడు ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వం భ్రమల్లో లేదని, నిమ్మగడ్డ రమేష్ కుమారే చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని విమర్శించారు.

ఇక.. విశాఖను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయబోతున్నామని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇకపై ప్రతి నెలా పారిశ్రామిక వేత్తలతో విశాఖలో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాంతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా పరిశ్రమలకు అనుమతి ఇస్తున్న తమపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.