Telugu Global
National

ఎన్నికల కమిషనర్, చీఫ్ సెక్రటరీ మధ్య లేఖాస్త్రాలు...

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు తిరిగి జరిపే విషయంలో ఎన్నికల చీఫ్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మధ్య లేఖాస్త్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ.. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ సూచించడంతో అసలు కథ మొదలైంది. పక్క రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముగిశాయి, గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది, ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయంటూ.. వివిధ కారణాలను చూపిస్తూ నిమ్మగడ్డ […]

ఎన్నికల కమిషనర్, చీఫ్ సెక్రటరీ మధ్య లేఖాస్త్రాలు...
X

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు తిరిగి జరిపే విషయంలో ఎన్నికల చీఫ్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మధ్య లేఖాస్త్రాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ.. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ సూచించడంతో అసలు కథ మొదలైంది. పక్క రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముగిశాయి, గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది, ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయంటూ.. వివిధ కారణాలను చూపిస్తూ నిమ్మగడ్డ ఆ ప్రతిపాదన చేశారు.

ఆ వెంటనే.. ఎన్నికలకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవని, ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖను రాశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆయన నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సహకరించేలా చూడాలంటూ ఆయన గవర్నర్ ను కోరారు. ప్రభుత్వ వైఖరి రాజ్యాంగ విరుద్ధమంటూ సీఎస్ లేఖకు బదులు కూడా ఇచ్చారు. దీంతో సీఎస్ నీలం సాహ్ని నుంచి మరో లేఖ ఎస్ఈసీకి వెళ్లింది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేది లేదని ఆమె మరోసారి పునరుద్ఘాటించినట్టు తెలుస్తోంది.

ఈ లేఖకు బదులుగా నిమ్మగడ్డ కూడా ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది. ఎన్నికల తేదీలను ప్రభుత్వానికి చెప్పాకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలనడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధం అని ఆ లేఖలో నిమ్మగడ్డ రాసినట్టు సమాచారం.

“మీరు చెప్పిందే జరగాలన్న, జరుగుతుందన్న భ్రమలో ఉండటం సరికాదు. ఎన్నికల తేదీ నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలే తప్ప సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ కోర్టు చెప్పింది. ప్రభుత్వ సమ్మతి తీసుకోవాలని చెప్పినట్టుగా వక్రభాష్యం చెప్పడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరా? అన్న అంశంపై ప్రభుత్వం ఇటీవల కోర్టుకెళ్లగా, దానిపై కోర్టు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల తేదీలు ఎవరు నిర్ణయించాలన్న విషయంలోనూ మీకు సందేహం ఉంటే కోర్టునే అడగండి. అంతే తప్ప మీకు తోచినట్లుగా వక్రభాష్యం చెప్పడం శిక్షార్హమైన నేరం” అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసినట్టు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గతంలో నిమ్మగడ్డ రమేష్ కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ ముందు రోజే టీడీపీ పత్రికల కార్యాలయాలకు చేరుకున్నట్టు.. ఈ లేఖ కూడా కేవలం టీడీపీ అనుకూల మీడియాలోనే రావడంతో.. వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ వ్యవహారం వెనక టీడీపీ హస్తం ఉందని బైటపడిందని ఆరోపిస్తున్నారు. పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా.. ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య లేఖాస్త్రాలు మాత్రం మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  19 Nov 2020 11:24 PM GMT
Next Story