రిటైర్మెంట్ తర్వాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిమ్మగడ్డ – విజయసాయి రెడ్డి

పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతోందంటే.. చంద్రబాబుకి, ఆయన కొడుకు లోకేష్ కి బాధ, భయం, కడుపుమంట అని విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పిటిషన్లు వేయించింది చంద్రబాబేనని గుర్తు చేశారు.

వైఎస్ హయాంలోసుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి పోలవరాన్ని అడ్డుకోవాలని చూశారని, కాల్వల తవ్వకంలో భూ సేకరణ జరక్కుండా చేసి 2004-2009 మధ్య కాలంలో ప్రాజెక్ట్ పనుల్ని అడ్డుకుంది కూడా చంద్రబాబేనని అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని 150 అడుగుల లోతున గోతిలో పాతేసిన ఘనత చంద్రబాబుదని, ఈ రాష్ట్రం గర్వించదగ్గ ప్రాజెక్టు కట్టి వైఎస్ఆర్ ఘనతను 150 అడుగుల ఎత్తున నిలబెడుతున్న వ్యక్తి జగన్ అని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైఎస్ కాబట్టి, అక్కడ ఆయన విగ్రహం పెట్టడమే అన్నివిధాలా సముచితం అని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తవుతుందని, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అసలు పాజిటివ్ దృక్పథమే లేని నెగెటివ్ పర్సన్ చంద్రబాబు అని అన్నారు విజయసాయిరెడ్డి.

కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేని సమయంలో చంద్రబాబు ప్రోద్బలంతో ఎన్నికలను ఆపేసిన నిమ్మగడ్డ.. ఇప్పుడు ప్రజా శ్రేయస్సుని పక్కనపెట్టి మరోసారి రాజకీయాలకోసం ఎన్నికలు జరపాలనుకుంటున్నారని విమర్శించారు. రిటైర్మెంట్ తర్వాత నిమ్మగడ్డ రమేష్ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని దింపేసి నాయకులంతా నిమ్మగడ్డకు అధ్యక్ష పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. సీఎం జగన్ ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్ళను పేదలకు ఇస్తుంటే.. టీడీపీకి మిగిలిన 20 సీట్లు కూడా పోతాయనే భయం పడ్డుకుందని అన్నారు.

రాష్ట్ర చరిత్రలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవొద్దని అడ్డుపడిన ఏకైక పార్టీగా టీడీపీ మిగిలిపోతుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చంద్రబాబు అనర్హుడని, ఇలానే అభివృద్ధి పథకాలను అడ్డుకుంటే భవిష్యత్ లో టీడీపీకి 2 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. విశాఖలో నేవీ నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల ప్రైవేట్ ఫ్లైట్స్ కి చాలా సమస్యలున్నాయని, దీంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ని అభివృద్ధి చేయకుండా వదిలేసి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని చంద్రబాబుకి హితవు పలికారు.

విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధికోసం.. నవంబర్ 21న ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో స్టార్టప్ సెంటర్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖకు ప్రపంచంలోనే మంచి నివాస యోగ్యమైన పట్టణంగా గుర్తింపు రావడం సంతోషకరమైన విషయం అని అన్నారు విజయసాయిరెడ్డి.

విశాఖలో జరిగే వ్యాపారాల్లో, కొన్ని భూ కుంభకోణాల్లో తన పేరుని కావాలని ఇరికిస్తున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎటువంటి వ్యాపారాలు లేవని, తన పేరుతో ఎవరైనా వ్యాపారం చేస్తామని చెబితే నమ్మవద్దని నాగార్జున కన్స్ ట్రక్షన్స్ పేరుతో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యాలని పేర్కొన్నారు.

జర్నలిస్ట్ కాని రామోజీ రావు వ్యాపారవేత్తగా ఉండి పత్రిక నడిపిస్తుంటే.. జర్నలిస్ట్ గా ఉండి రాధాకృష్ణ వ్యాపారవేత్తగా మారారని అన్నారు. వారిద్దరి దేహం తెలుగుదేశం అంటూ జ్వలిస్తుందని ఎద్దేవా చేశారు.