మరోసారి ”ఆహా” అనిపించలేకపోయింది

వందశాతం తెలుగు యాప్ అంటూ దూసుకొచ్చిన ఓటీటీ యాప్ ఆహా. ప్రతి వారం ఇందులో ఏదో ఒక కొత్త కంటెంట్ పెడుతున్నారు. టాక్ షోలు కూడా ప్రారంభించారు. కొత్త కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు ఉంచుతున్నారు. కానీ ఏ ఒక్క సినిమాతో ప్రేక్షకులతో ఆహా అనిపించుకోలేకపోతోంది ఈ ఓటీటీ వేదిక.

ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాల్లో కేవలం ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫొటో సినిమాలు మాత్రమే ఆహాలో ఓకే అనిపించుకున్నాయి. మిగతా సినిమాలన్నీ వేటికవే ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. యాప్ లో అలా కనిపిస్తున్నాయన్నమాటే తప్ప, వీటిని క్లిక్ చేసి చూసే వాళ్లు తగ్గిపోయారు.

ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా మరో సినిమా చేరిపోయింది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా అనగనగా ఓ అతిథి సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది ఆహా. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.

దీంతో ఆహాలో పెట్టే కంటెంట్ పై అనుమానాలు పెరిగిపోయాయి. సరైన సినిమా ఒక్కటి కూడా పట్టలేకపోతోంది ఈ సంస్థ. మరీ ముఖ్యంగా ఓటీటీకి వెన్నెముకగా అల్లు అరవింద్ లాంటి ఇండస్ట్రీ ప్రముఖుడు ఉండి కూడా ఆహా మెరవలేకపోతోంది.