అమరావతి ఉద్యమం… చివరికి కాంగ్రెస్ చేతికి…

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమం.. చివరికి కాంగ్రెస్ దరికి చేరింది. తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. ఉద్యమానికి మద్దతుగా జోలెపట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు కూడా కనీసం అటువైపు చూడటంలేదు. మందడంలో రోడ్డుపై బైఠాయించి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ కూడా నేరుగా అమరావతి ప్రాంతానికి వెళ్లడంలేదు, రైతు నాయకులు తన వద్దకు వచ్చినప్పుడు మాత్రమే ధైర్యవచనాలు చెబుతున్నారు.

ఇక బీజేపీది పూర్తి అయోమయం. మాకు అధికారం ఇవ్వండి.. వారం రోజుల్లో అమరావతి సమస్య పరిష్కరిస్తామంటారు రాష్ట్ర బీజేపీ నాయకులు. బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం తరపున రాజధాని అంశం మా పరిధిలోది కాదంటూ.. సుప్రీం కోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఇలా.. రకరకాల కారణాలతో అన్ని పార్టీలు అమరావతి ఉద్యమానికి మొహం చాటేశాయి. చివరికి ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఉద్యమం జోలికి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామంటూ ధైర్యం చెప్పారు.

పార్లమెంటులోనూ గళమెత్తుతామని, జాతీయ నేతలతో కలసి బహిరంగ సభపెడతామంటూ రకరకాల వాగ్దానాలిచ్చారు. అభివృద్ధికోసం రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకి మద్దతు తెలపాల్సి ఉంది. కానీ విచిత్రంగా ఒకటే రాజధాని అంటూ కాంగ్రెస్ నాయకులు గళమెత్తారు.

ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించిన నేతలు.. రైతులకు మద్దతుగా ఇకపై తాము బరిలో దిగుతామంటూ ధైర్యం చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు సరికాదని, రాజధాని అని ప్రకటించకుండానే విశాఖను అభివృద్ధి చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.

మొత్తమ్మీద అమరావతి ఉద్యమానికి అన్ని పార్టీలు దూరమవుతున్న దశలో.. చివరకు కాంగ్రెస్ పార్టీ రైతుల వద్దకు చేరింది.