పవన్ ఎపిసోడ్… జనసైనికుల్లో అసంతృఫ్తి

తప్పో ఒప్పో పవన్ కల్యాణ్ రెండు రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. ఎన్నికలనుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించేశారు, బీజేపీకి పూర్తి మద్దతివ్వాలంటూ జనసైనికులకు హిత బోధ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసైనికులు గ్రేటర్ ఎన్నికలను లైట్ తీసుకుంటారా లేక, బీజేపీకోసం కష్టపడతారా, వారి జయాపజయాల్లో భాగస్వాములవుతారా అనేదే పెద్ద ప్రశ్న.

పవన్ కల్యాణ్ నేరుగా బీజేపీకి మద్దతు తెలిపితే జనసైనికులు కూడా పెద్దగా ఆలోచించేవారు కాదు. తమది ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ కాబట్టి.. పాలనకోసం వేరే పార్టీ నాయకుల్ని ఎన్నుకుని అధికారంలో తామూ భాగం అని సంతోషించేవారు. కానీ పవన్ అలా చేయలేదు. గ్రేటర్ పోరులో దిగుతాం అని బల్లగుద్దారు. జాబితా తయారు చేయించారు. ఆశావహులు.. ఆశల్ని రెట్టింపు చేసేలా ఆవేశంగా ప్రసంగాలిచ్చారు. “2014లో ప్రశ్నించడం కోసం అనేది మన స్లోగన్. అలా మనం ప్రశ్నిస్తూ పోతుంటే.. మిగతావాళ్లంతా అధికారం అనుభవిస్తున్నారు. ఇకపై మనం కూడా అధికారం కోసం అనే నినాదం ఎత్తుకోవాల”ని నాయకుల్లో కొత్త ఆశలు రేకెత్తించారు. కట్ చేస్తే ఇప్పుడు సర్దుకుపోండి అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్ని జనసైనికులు జీర్ణించుకోగలరా. బహిరంగంగా ఎవరూ పవన్ ని విమర్శించడంలేదు కానీ.. లోలోపల జనసేనానిపై అసంతృప్తితో ఉన్నారు. రాజకీయ పార్టీ మనుగడకు పోటీయే ముఖ్యం. పోటీనుంచి పక్కకు తప్పుకుంటున్నాం అంటే.. పోటీ చేయగలిగే సత్తా లేదని ఒప్పుకోవడమే. బలమైన నాయకత్వం కోసం బీజేపీకి ఓటు వేయండి అంటే, తమది బలహీన నాయకత్వం అని ఒప్పుకున్నట్టే కదా.

ఇలాంటి మాటల్ని జనసైనికులు ఎలా అర్థం చేసుకోవాలి. పోనీ బీజేపీతో పొత్తున్యాయం పాటించాలని అనుకుందాం.. కనీసం 150లో 10సీట్లయినా అడిగి సాధించుకునే సత్తా పవన్ కల్యాణ్ కి లేదా. బుజ్జగిస్తే.. పార్టీని, క్యాడర్ని కూడా బలిచేయడానికి పవన్ వెనకాడరా? అసలేంటి పవన్ వాలకం. ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అంతర్మథనం.

జనసేన తేనెతుట్టెను కదిలించకుండా, కార్యకర్తల్లో, నాయకుల్లో ఆశలు రేకెత్తించకుండా నేరుగా బీజేపీకి మద్దతిస్తే అది మరోలా ఉండేది. ఇప్పుడు రెచ్చగొట్టి మరీ తుస్సుమనిపించే సరికి జనసైనికులు పార్టీకి సహాయ నిరాకరణ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.