Telugu Global
National

శశికళ విడుదల కాకుండా కొర్రీలు!

అవినీతి ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నెచ్చెలి.. శశికళ (చిన్నమ్మ) విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు విధించిన జరిమానా చెల్లించడంతో ఆమె ముందస్తుగా విడుదలవుతారని అంతా భావించారు. లాయర్లు కూడా ఇదే మాట చెప్పారు. అయితే శశికళ ఎంట్రీతో తమిళనాట రాజకీయాలు మారబోతున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. అన్నా డీఎంకే చీలిపోతుందని.. ఆ పార్టీలోని కీలక నేతలంతా శశికళ వెనక నడుస్తారన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. కొందరైతే శశికళ అన్నాడీఎంకేను హస్తగతం చేసుకుంటుందని […]

శశికళ విడుదల కాకుండా కొర్రీలు!
X

అవినీతి ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నెచ్చెలి.. శశికళ (చిన్నమ్మ) విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు విధించిన జరిమానా చెల్లించడంతో ఆమె ముందస్తుగా విడుదలవుతారని అంతా భావించారు. లాయర్లు కూడా ఇదే మాట చెప్పారు.

అయితే శశికళ ఎంట్రీతో తమిళనాట రాజకీయాలు మారబోతున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. అన్నా డీఎంకే చీలిపోతుందని.. ఆ పార్టీలోని కీలక నేతలంతా శశికళ వెనక నడుస్తారన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. కొందరైతే శశికళ అన్నాడీఎంకేను హస్తగతం చేసుకుంటుందని కూడా అంచనా వేశారు.

కానీ తాజాగా కర్ణాటక హోంమంత్రి ప్రకటనతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. శశికళ ఇప్పట్లో బయటకు రాలేదని.. ఆమె పూర్తి కాలం శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే శశికళ బయటకు రావడం బీజేపీకి ఇష్టం లేదన్నది మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది. ‘గడువు కంటే ముందే శశికళ విడుదల అయ్యే అవకాశం లేదు. ఆమె పూర్తికాలం శిక్ష అనుభవించాల్సిందే’ అని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ పేర్కొన్నారు. దీంతో శశికళ అభిమానులు, అనుచరుల్లో ఆందోళన మొదలైంది.

అసలు శశికళ ఎప్పుడు బయటకు వస్తారో అని వారు టెన్షన్​ పడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.

కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది. అయితే సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి ‘2021 జనవరిలో శశికళ విడుదలవుతారని’ జైలు సూపరింటెండెంట్‌ బదులిచ్చారు. దీంతో ఆమె ఇటీవలే కోర్టుకు రూ.10 కోట్ల జరిమానా చెల్లించారు.

కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి శశికళకు మొత్తం 129 రోజులను సెలవులుగా ప్రకటించి విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఆమె త్వరలో విడుదల కాబోతోందని.. ఆమె రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే 60 చోట్ల ఘన స్వాగతం పలికేందుకు దినకరన్ ఏర్పాట్లకు కూడా సమాయత్తమయ్యారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బెంగళూరులోని విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని చెప్పారు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలని, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్షా కాలం ఉంటుంది. ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని పేర్కొన్నారు.

శశికళ ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

కాగా శశికళ తమిళనాడులో ఎంట్రీ ఇస్తే అక్కడ రాజకీయాలు పూర్తిగా మారే అవకాశం ఉన్నది. ప్రస్తుత తమిళనాడు సీఎం పళనిస్వామి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. శశికళ వస్తే ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఉన్న కీలకనేతలంత శశికళకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో పోల్చుకుంటే శశికళకు ప్రజాదరణ, ఆర్థిక బలం ఎక్కువ. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలను బీజేపీ పెద్దలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శశికళ ముందస్తు విడుదల బీజేపీ అగ్రనాయకత్వానికి ఇష్టం లేనట్టు ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ పార్టీకి చెందిన మంత్రి శశికళ విడుదలపై వ్యాఖ్యానించారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.

First Published:  21 Nov 2020 4:02 AM GMT
Next Story