రామకృష్ణ పరిరక్షణ యాత్రకు సీపీఎం దూరం… అందుకేనా?

2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని వైసీపీ ప్రభుత్వం ధీమాగా చెబుతున్న సందర్భంలో చంద్రబాబుకి ఊపిరాడట్లేదు. ఈ డెడ్ లైన్ ప్రకటించిన తర్వాతే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ప్రాజెక్ట్ పై లేనిపోని కథనాలల్లాయి. ఎత్తు తగ్గిస్తున్నారని, పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యాన్ని పట్టించుకోవడంలేదని వార్తలు వండివార్చాయి.

తాజాగా సీపీఐ మొదలు పెట్టిన పోలవరం పరిరక్షణ యాత్ర కూడా బాబు రూపకల్పన చేసిందే. రాయలసీమ బిడ్డ అయిఉండి కూడా.. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ అభివృద్ధి వికేంద్రీకరణకు నేరుగా అడ్డుపడిన చరిత్ర సీపీఐ రామకృష్ణది. ప్రజా సమస్యలపై జరిగే పోరాటంలో గతంలో వామపక్షాలు కలసిమెలసి ఉండేవి. కానీ రామకృష్ణ.. పూర్తిగా చంద్రబాబు స్టాండ్ తీసుకున్నాక రాష్ట్రంలో సీపీఐతో పూర్తిగా విభేదీస్తూ వచ్చింది సీపీఎం. దీంతో రామకృష్ణ బహిరంగంగానే ఎర్రముసుగులో పచ్చ అజెండా అమలు చేయడం మొదలు పెట్టారు.

టిడ్కో ఇళ్ల వ్యవహారంలో సీపీఐతో కలసి వచ్చిన సీపీఎం, పోలవరం పరిరక్షణ యాత్రకు ఎందుకు మద్దతివ్వలేదని ఆరాతీస్తే.. అది పూర్తిగా చంద్రబాబు అజెండా అనే విషయం అర్థమవుతుంది. అమరావతి, పోలవరం.. ఈ రెండిటినీ ఎంతకాలం సాగదీస్తే.. అంతగా జనాల్లో ఉండవచ్చని చంద్రబాబు ఆలోచన. ఐదేళ్లకాలంలో ఆయన అదే చేశారు. ఇప్పుడు అమరావతి అటకెక్కేసింది, ఉన్న పోలవరం కూడా 2021 డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. ఇక భవిష్యత్ లో బాబు ఏంచేయాలి. తన ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయనే ఆక్రోశంతో సీపీఐతో పోలవరం పరిరక్షణ యాత్ర మొదలు పెట్టించారు బాబు.

అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలు అంటూ దాన్ని పూర్తిగా శాంతిభద్రతల సమస్యగా మార్చేసి.. తమాషా చూస్తున్నారు. పోలవరం దగ్గర ఏదో జరిగిపోతోందని, దాన్ని చూడ్డానికి వెళ్తున్న నాయకుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారనే విధంగా చంద్రబాబు అనుకూల మీడియా కథనాలు ఇస్తోంది. వాస్తవానికి చంద్రబాబు హయాంలో కంటే.. వైసీపీ వచ్చాక, మేఘా సంస్థ ఆధ్వర్యంలో పోలవరం పనులు చురుగ్గా సాగుతున్నాయి.

మేఘా నిర్మాణ సంస్థ ఇచ్చిన భరోసాతోనే వైసీపీ.. ప్రాజెక్ట్ నిర్మాణం 2021 డిసెంబర్ కి పూర్తవుతుందని నమ్మకంగా ఉంది. 2022నాటికి రైతులకు పోలవరం నీళ్లిస్తామని ధైర్యంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పోలవరాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. పరిరక్షణ యాత్రలంటూ రామకృష్ణతో హడావిడి చేయిస్తున్నారు.