Telugu Global
International

ఆయుర్వేదం వర్సెస్ అల్లోపతి... ఆపరేషన్ల తేనెతుట్టె కదిల్చిన కేంద్రం...

ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై ఆపరేషన్లు చేయొచ్చు అంటూ కేంద్రం కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలు భారతీయ వైద్య రంగంలో కలకలం రేపుతున్నాయి. ఆయుర్వేదంలో పీజీ చేసిన విద్యార్థులకు శస్త్ర చికిత్సల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం, ఇందుకోసం పీజీ ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్-2016కి సవరణలు చేసింది. దీని ద్వారా 58 రకాల ఆపరేషన్లు చేయడానికి ఆయుర్వేదంలో పీజీ చేసిన విద్యార్థులకు అనుమతి లభించినట్టయింది. అయితే దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం […]

ఆయుర్వేదం వర్సెస్ అల్లోపతి... ఆపరేషన్ల తేనెతుట్టె కదిల్చిన కేంద్రం...
X

ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై ఆపరేషన్లు చేయొచ్చు అంటూ కేంద్రం కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలు భారతీయ వైద్య రంగంలో కలకలం రేపుతున్నాయి. ఆయుర్వేదంలో పీజీ చేసిన విద్యార్థులకు శస్త్ర చికిత్సల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం, ఇందుకోసం పీజీ ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్-2016కి సవరణలు చేసింది. దీని ద్వారా 58 రకాల ఆపరేషన్లు చేయడానికి ఆయుర్వేదంలో పీజీ చేసిన విద్యార్థులకు అనుమతి లభించినట్టయింది. అయితే దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఆయుర్వేదం చదివినవారికి ఆపరేషన్లు చేసే అనుమతి ఇవ్వడం వైద్యరంగాన్ని వెనక్కు తీసుకెళ్లడమేనని ఆరోపించింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఇక నీట్ లాంటి పరీక్షలకు ఏం విలువ ఉంటుందని, కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించి చదువుకుని ప్రాక్టీస్ చేసినవారికి, దగ్గరదారిలో ఆయుర్వేదం చదివినవారికీ తేడా ఏముంటుందని ప్రశ్నించింది.

అయితే కేంద్రం మాత్రం తమ సంస్కరణలను సమర్థించుకుంటోంది. ప్రాచీన ఆయుర్వేదంలో ఆధునిక వైద్యాన్ని కలిపే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలను ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ కోటేచా ఖండించారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ విద్యార్థులు నిర్వహించాల్సిన సర్జరీలకు సంబంధించి కేవలం స్పష్టత మాత్రమే ఇచ్చామని, కొత్తగా ఆయుర్వేద విద్యార్థుల పరిధిలోకి ఏ శస్త్ర చికిత్స తీసుకు రాలేదని చెప్పారు.

ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు సవరణలు మాత్రమే చేశామని అన్నారు. 25ఏళ్లుగా ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు వాటికి చట్టబద్ధత మాత్రమే కల్పించామని సీసీఐఎం బోర్డు చైర్మన్ జయంత్ దేవ్ పూజారి తెలిపారు.

ఇటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అల్లోపతి కాకుండా.. ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారం బాగా జరుగుతోంది. సాక్షాత్తూ మంత్రులే.. అప్పడాలు తింటే కరోనా తగ్గిపోతాయని, గోమూత్రం తాగితే ఫలానా వ్యాధి నయం అవుతుందని చెప్పిన ఉదాహరణలున్నాయి.

ప్రాచీన వైద్య విధానాలను ఎవరూ కాదనలేరు కానీ, సాంకేతికత తీసుకొస్తున్న మార్పులు చేర్పులను అంగీకరించకపోతేేనే అసలు సమస్య తలెత్తుతుంది. పతంజలి పేరుతో జరిగే వ్యాపారానికి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంతమంది, ఎన్నిరకాలుగా సహకారం అందిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు మొదలైన సమయంలోనే కరోనిల్ పేరుతో పతంజలి ఓ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ధైర్యంగా తేగలిగిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు కోర్టు కేసుల వరకు వ్యవహారం వెళ్లడంతో అది కేవలం బలానికి వాడే మందు అని తేల్చేసింది పతంజలి సంస్థ.

ఆయుర్వేదం పేరుతో భారత దేశంలో ప్రజల నమ్మకాలతో జరుగుతున్న వ్యాపారం వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటి వ్యాపార సంస్థల కార్యకలాపాలు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. ఈ దశలో.. ఆయుర్వేద వైద్యులు 58రకాల ఆపరేషన్లు చేసుకునేలా కేంద్రం తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు మరింత సంచలనంగా మారాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  22 Nov 2020 10:41 PM GMT
Next Story