కరోనా సెకండ్​వేవ్ వస్తోంది… జర భద్రం… అధికారులకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా సెకండ్​వేవ్​ భయపెడు తోంది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్​ అధికారులతో సమావేశమయ్యారు. సెకండ్​ వేవ్​ వచ్చినా ఎదుర్కొనేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు. 

ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని కోరారు. కరోనా సెకండ్​వేవ్​ పరిస్థితులపై ఆయన ఆదివారం ప్రగతిభవన్​లో అధికారులతో సమీక్షించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, మెడికల్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ….

‘ఇప్పుడైతే రాష్ట్రంలో కరోనా కంట్రోల్లోనే ఉన్నది. కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. టెస్టుల సంఖ్య పెంచినా కేసులు పెరగడం లేదు. అయినప్పటికీ చలికాలం కాబట్టి కేసుల సంఖ్య పెరగొచ్చని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. అందువల్ల వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పదివేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్​ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వ్యాక్సిన్​ వస్తుంది కాబట్టి అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్​ వస్తే ముందుగా వైద్య ఆరోగ్యసిబ్బందికి వేస్తాం ‘ అని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు.