ఢిల్లీకి పవన్… అసలేంటి సంగతి…?

పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతిచ్చినా, బీజేపీతో కలిసి తిరిగినా.. ఆయా పార్టీల అధినేతల దగ్గర ఆయనకు ఉండే ప్రయారిటీయే వేరు. టీడీపీలో ఎవరికీ దక్కని ప్రాధాన్యం చంద్రబాబు పవన్ కు ఇచ్చేవారు. అటు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద కూడా పవన్ కి మంచి ఇమేజే ఉంది. దీనికి నిదర్శనమే పవన్ కి తరచూ కేంద్ర పెద్దల దర్శన భాగ్యం కలగడం.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా కేంద్ర నాయకత్వాన్ని అన్నిసార్లు వ్యక్తిగతంగా కలసి ఉండరేమో. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను వ్యక్తిగతంగా కలవడానికి హస్తిన వెళ్లారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ముందుండటం, ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి అన్ని సీట్లనూ జనసేన త్యాగం చేయడం, ఏపీలో మూడు రాజధానులు, స్థానిక ఎన్నికల కోసం జరుగుతున్న హడావిడి.. తదితర అంశాలపై పవన్, నడ్డా మధ్య చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.

బీజేపీ జాతీయ నాయకత్వం అమరావతికే కట్టుబడి ఉందని పలు సందర్భాల్లో పవన్ ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం ఆ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోందని కూడా చురకలంటించారు. ఈ నేపథ్యంలో మరోసారి అమరావతి విషయంపై బీజేపీ జాతీయ నేతలతో పవన్ సమాలోచనలు జరుపుతారా? సమావేశం పూర్తయ్యాక బైటకొచ్చి ఏదైనా సంచలన విషయం చెబుతారా? అనేది సస్పెన్స్ గా మారింది.

గ్రేటర్ ఎన్నికల బరిలో దిగే విషయంలో బీజేపీ నేతలు తనతో సంప్రదింపులు జరపకపోయే సరికి.. పవన్ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తానని చెప్పారు. తీరా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బుజ్జగించే సరికి వెనక్కు తగ్గారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా పవన్ త్యాగం చేయాల్సి రావొచ్చు. ఆ త్యాగానికి “విస్తృత ప్రయోజనాలు” అనే అందమైన పేరు కూడా పెట్టొచ్చు.

గ్రేటర్ బరి కాబట్టి.. కిషన్ రెడ్డి చెబితే సరిపోయింది, అదే ఏపీలో లోక్ సభ ఉప ఎన్నికకు అంతకంటే పెద్ద స్థాయి నేతలే పవన్ ని బుజ్జగించాల్సి రావొచ్చు. అందుకే ఆ పని జాతీయ అధ్యక్షుడు భుజాన వేసుకున్నారని, పవన్ తో భేటీలో అదే ప్రధాన అంశం అవుతుందని చెబుతున్నారు.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ హస్తిన యాత్ర అటు జనసేన, ఇటు బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.