Telugu Global
National

ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్దాం... సహకరించండి...

కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిపి తీరాల్సిందేనంటున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పటికే రెండు దఫాలు ఈ వ్యవహారంపై ఎస్ఈసీ, సీఎస్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఎన్నికలకు వెళ్దాం, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టించండి అంటూ ఎస్ఈసీ.. రాష్ట్రంలోని పరిస్థితులు అందుకు సహకరించవు, కాస్త ఆగండి అంటూ సీఎస్ లేఖలు రాసుకున్నారు. ఇటీవల కాస్త గ్యాప్ వచ్చిన ఈ ఎపిసోడ్ […]

ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్దాం... సహకరించండి...
X

కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిపి తీరాల్సిందేనంటున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పటికే రెండు దఫాలు ఈ వ్యవహారంపై ఎస్ఈసీ, సీఎస్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఎన్నికలకు వెళ్దాం, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టించండి అంటూ ఎస్ఈసీ.. రాష్ట్రంలోని పరిస్థితులు అందుకు సహకరించవు, కాస్త ఆగండి అంటూ సీఎస్ లేఖలు రాసుకున్నారు.

ఇటీవల కాస్త గ్యాప్ వచ్చిన ఈ ఎపిసోడ్ తిరిగి నిమ్మగడ్డ లేఖతో మరోసారి మొదలైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సోమవారం మరో లేఖ రాశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు, దానికి తగిన సహకారాలు అందించాలని, నిధులు సమకూర్చాలని ఆయన లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 17న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ లేఖతో కలిపి పంపించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్ ‌పై, హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన తీర్పును ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోసం ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించినట్టు, కోర్టు తీర్పు ప్రతి అందగానే.. దాన్ని జతచేసి పంపించినట్టు లేఖలో ఎస్ఈసీ తెలియజేశారు.

ఎన్నికల సంఘం వినతిపై… ప్రభుత్వం స్పందించి, అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర సహకారం అందించాలని ఆర్థిక, పంచాయతీ రాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శుల్ని హైకోర్టు ఆదేశించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయాన్ని రమేశ్‌ కుమార్‌ గుర్తుచేశారు.

మరోవైపు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు డైరెక్షన్ పేరుతో నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆ డైరెక్షన్లో పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించామని, దీనికి వీలుగా డిసెంబర్‌ 21 తేదీ నాటికి గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితా మాస్టర్‌ కాపీలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయని కారణంగా ఆ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు.

మొత్తమ్మీద స్థానిక ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరోనా పూర్తి స్థాయిలో తగ్గే వరకు ఎన్నికలకు వెళ్లేది లేదని ఇటు ప్రభుత్వం కూడా బీష్మించుకు కూర్చుంది.
సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘ఈ నెలలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాలన్నీ నివేదిక అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహమ్మారిపై యుద్ధానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోతే డిసెంబరులో అత్యంత ఘోర, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనాపై సమర్థంగా పోరాడేందుకు వీలుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం కోరుతున్నారో నివేదిక అందించండి’ అని సుప్రీంకోర్టు సోమవారమే రాష్ట్రాలకు ఉత్తర్వులిచ్చింది.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కరోనా విపత్తు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అర్థమవుతోంది. ఒకవేళ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఎస్ఈసీ నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించినా, దానిపై నిమ్మగడ్డ హైకోర్టు మెట్లెక్కినా.. సుప్రీం ఉత్తర్వులు స్థానిక ఎన్నికలకు అడ్డుపడతాయనే విషయంలో అనుమానం లేదు.

First Published:  23 Nov 2020 8:26 PM GMT
Next Story