Telugu Global
National

తిరుపతి టికెట్ పై జనసేన పట్టు... బీజేపీ పెద్దలతో పవన్ భేటీ

ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా రాకముందే వేడి అప్పుడే మొదలైంది. టీడీపీ తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మి ని ముందే ప్రకటించగా, వైసీపీ డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఖరారు చేసింది. జనసేన తో బీజేపీ పొత్తు ఉండడంతో.. తిరుపతిలో ఆ రెండు పార్టీల్లో ఎవరు బరిలోకి దిగుతున్నారనే విషయమై ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించి ఆ మేరకు […]

తిరుపతి టికెట్ పై జనసేన పట్టు... బీజేపీ పెద్దలతో పవన్ భేటీ
X

ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా రాకముందే వేడి అప్పుడే మొదలైంది. టీడీపీ తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మి ని ముందే ప్రకటించగా, వైసీపీ డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఖరారు చేసింది. జనసేన తో బీజేపీ పొత్తు ఉండడంతో.. తిరుపతిలో ఆ రెండు పార్టీల్లో ఎవరు బరిలోకి దిగుతున్నారనే విషయమై ఇప్పటికి కూడా క్లారిటీ లేదు.

తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించి ఆ మేరకు పార్టీ నాయకులతో నామినేషన్ కూడా వేయించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

అయితే బీజేపీ కోరినందువల్లే పవన్ కళ్యాణ్ పోటీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఏపీలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన, బీజేపీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

గ్రేటర్ ఎన్నికల నుంచి బీజేపీ కోరినందువల్లే తప్పుకున్నందువల్ల తిరుపతి ఎంపీ స్థానం జనసేనకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారమై తేల్చుకునేందుకు సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు.

ఇవాళ పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతో చర్చించనున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లులో ఓడిపోయినప్పటికీ తిరుపతి అసెంబ్లీ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో జనసేన కు భారీగా ఓట్లు పోలయ్యాయి.

దీనికి తోడు పవన్ సామాజికవర్గం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని జనసేనకు టికెట్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నుంచి తప్పుకున్నందుకు గాను బీజేపీ తిరుపతి స్థానాన్ని జనసేనకి ఇస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

First Published:  23 Nov 2020 11:03 PM GMT
Next Story