Telugu Global
National

మీరు తెలంగాణ జోలికి వస్తే... నేను ఢిల్లీ జోలికి వస్తా...

బీజేపీ దెబ్బకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విలవిల్లాడిపోతోంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నా చివరకు చిత్తవుతోంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఉండేది. ఇప్పుడు ఆ మూడో కూటమికి కూడా కాంగ్రెస్సే నేతృత్వం వహిస్తోంది. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ లను కాదని మరో ప్రత్యామ్నాయ మార్గం చూపెడతానంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ నుంచే దాన్ని నడిపిస్తానంటున్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చెబుతున్న మాటలే అయినా వీటిని అంత తేలిగ్గా […]

మీరు తెలంగాణ జోలికి వస్తే... నేను ఢిల్లీ జోలికి వస్తా...
X

బీజేపీ దెబ్బకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విలవిల్లాడిపోతోంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నా చివరకు చిత్తవుతోంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఉండేది. ఇప్పుడు ఆ మూడో కూటమికి కూడా కాంగ్రెస్సే నేతృత్వం వహిస్తోంది.

ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ లను కాదని మరో ప్రత్యామ్నాయ మార్గం చూపెడతానంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ నుంచే దాన్ని నడిపిస్తానంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చెబుతున్న మాటలే అయినా వీటిని అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఎందుకంటే ఒకటికి రెండుసార్లు కేసీఆర్ ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకేసి జాతి ప్రయోజనాలకోసం త్యాగం చేయడానికి సైతం వెనకాడను అంటున్నారు కేసీఆర్.

“50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, దేశంలో కొత్త ప్రయోగం రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దేశంలో సంపద సృష్టించే తెలివితేటలు వాటికి లేవు. వ్యక్తులను నిందించలేం కానీ, ఆ పార్టీ విధానాలే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దేశంలో సంపద సృష్టించి, ప్రజలకు పంచే ప్రభుత్వం రావాలి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తోంది అదే. తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కాకుండా.. దేశం ఒక కొత్త పంథాలో, కొత్త మార్గంలో కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. బహుశా ఆ ఆవిష్కర్తగా నేనే ఎదగొచ్చు.

నాకు ఆ ఆలోచన ఉంది. చాలా మందితో నేను మాట్లాడా. త్వరలోనే మీరు చూడబోతారు. ఎల్‌ఐఎసీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్ని ఏ కారణంతో అమ్ముతున్నారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న దేశాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు, అవసరమైతే జాతి ప్రయోజనాకోసం ఏ త్యాగం చేసైనా ముందుకెళ్తా.

ఒకసారి దాన్ని ఎత్తుకుంటే ఏవిధంగా ముందుకు వెళ్తానో అందరికీ తెలుసు. చిల్లరగాళ్లు ఎన్నో మాట్లాడొచ్చు, కానీ నేను బాగా ఆలోచిస్తున్నా.. మథనం చేస్తున్నా. జాతి ప్రయోజనాల పరిరక్షణకు కూడా టీఆర్ఎస్ ఎప్పుడూ అగ్రభాగాన ఉంటుంది. సెంట్రల్ పి.ఎస్.యు కార్మికుల పక్షాన మొదలు పెట్టే పోరాటమే దీనికి నాంది అవుతుంది” అని అన్నారు కేసీఆర్.

కేసీఆర్ మాటల్లో చాలా క్లారిటీ ఉంది. కాంగ్రెస్, బీజేపీని పక్కనపెట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ముందుకెళ్లాలని చెప్పిన కేసీఆర్.. తాను కలుపుకొని వెళ్లాలనుకుంటున్న ఇరుగు పొరుగు రాష్ట్రాల అధినేతలు, ముఖ్యనేతల పేర్లను కూడా గతంలోనే ప్రస్తావించారు. ఏపీ సీఎం జగన్ పేరు ఆ లిస్ట్ లో లేకపోవడం కూడా కేసీఆర్ వ్యూహంలో ఓ భాగమే.
దుబ్బాక ఫలితం కేసీఆర్ ఆలోచనను పూర్తిగా మార్చేసినట్టు అర్థమవుతోంది.

ఇన్నాళ్లూ తెలంగాణలో టీడీపీని అడ్రస్ లేకుండా చేయడానికి ఎత్తుగడ వేసిన కేసీఆర్ ఆ క్రమంలో కాంగ్రెస్, బీజేపీని చిన్నచూపు చూశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ చారిత్రక తప్పు చేసి తెలంగాణ సమాజం దృష్టిలో పలుచన అయింది. ఇక బీజేపీ ఎదుగుదలను కూడా మొగ్గలోనే తుంచేయాలని చూస్తున్నారు కేసీఆర్. అందుకే జాతీయ కూటమి అంటూ కొత్త లెక్కలు తీస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇలాంటి ప్రయోగం చేసి విఫలం అయ్యారు. ఇప్పుడు మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జాతికోసం జాతీయ స్థాయికి వెళ్తానంటున్నారు.

మరి గ్రేటర్ ఎన్నికలు అయిపోయాక కేసీఆర్ సైలెంట్ అవుతారా? ఈసారి మరింత గట్టిగా ప్రయత్నించి కూటమితో బీజేపీని వణికిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

మొత్తమ్మీద కేసీఆర్ మాటలు చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చీమ అన్నట్టు.. మీరు (బీజేపీ) తెలంగాణ జోలికొస్తే, నేను మీ హస్తిన పీఠానికే ఎసరు పెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది కేవలం ధిక్కార స్వరమా, లేక భవిష్యత్ ముఖ చిత్రమా అనేది వచ్చే ఎన్నికలనాటికి తేలిపోతుంది.

First Published:  23 Nov 2020 8:36 PM GMT
Next Story