Telugu Global
National

వ్యవస్థల్ని గుప్పెట పట్టిన చంద్రబాబుకి రాజకీయ అవస్థ...

మేము తెలుగు భాష లెక్క.. అక్కడా ఉంటాం ఇక్కడా ఉంటాం అనేది చంద్రబాబు డైలాగ్. కానీ తెలంగాణలో ఉన్నా కూడా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయలేని పరిస్థితి. ఏపీకి వచ్చినా కూడా ఎక్కడికీ వెళ్లలేని దుస్థితి. ఒకరకంగా రాజకీయ నిస్తేజ స్థితికి చేరుకున్నారు చంద్రబాబు. జూమ్ ఆప్ లేకపోతే కరోనా కష్టకాలంలో అసలు చంద్రబాబు పరిస్థితి ఏంటా అనేది అంచనాలకు అందని ప్రశ్న. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. అటు […]

వ్యవస్థల్ని గుప్పెట పట్టిన చంద్రబాబుకి రాజకీయ అవస్థ...
X

మేము తెలుగు భాష లెక్క.. అక్కడా ఉంటాం ఇక్కడా ఉంటాం అనేది చంద్రబాబు డైలాగ్. కానీ తెలంగాణలో ఉన్నా కూడా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయలేని పరిస్థితి. ఏపీకి వచ్చినా కూడా ఎక్కడికీ వెళ్లలేని దుస్థితి. ఒకరకంగా రాజకీయ నిస్తేజ స్థితికి చేరుకున్నారు చంద్రబాబు. జూమ్ ఆప్ లేకపోతే కరోనా కష్టకాలంలో అసలు చంద్రబాబు పరిస్థితి ఏంటా అనేది అంచనాలకు అందని ప్రశ్న.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. అటు తెలంగాణలో గ్రేటర్ పై పట్టుకోసం బీజేపీ, టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణపై తమకు ఇంకా పట్టుందని నిరూపించుకున్న టీడీపీ.. క్రమ క్రమంగా అక్కడ కనుమరుగవుతూ వచ్చింది.

ఓటుకు నోటు వ్యవహారం తర్వాత నేతలు, కార్యకర్తలు చేజారిపోయారు. ప్రస్తుతం టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారిని నమ్మకస్తులు అనాలా.. లేక ఇంకే పార్టీలోనూ చోటు దక్కించుకోలేక మిగిలిపోయిన నేతలు అనాలా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం కూడా చంద్రబాబు కానీ, టీడీపీ భావి నేతగా చెప్పుకుంటున్న లోకేష్ కానీ గ్రేటర్ లో ప్రచారం చేయలేకపోతున్నారు. కారణాలేంటని టీడీపీ కార్యకర్తలు అడగలేరు, చంద్రబాబు పైకి చెప్పుకోలేరు.

కళ్లముందే గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నా, అందులో టీడీపీ పోటీ చేస్తున్నా ఏమీ చేయలేని నిస్తేజ స్థితికి చేరుకున్నారు చంద్రబాబు. పోనీ ఏపీలో ఏమైనా ఘనంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక తరుముకొస్తున్నా అభ్యర్థిని ప్రకటించారే కానీ, సదరు అభ్యర్థితో కనీసం తాను బరిలో ఉన్నానని ఒక్క మాట కూడా చెప్పించలేకపోతున్నారు. టీడీపీకి అసలు ఇలాంటి దశ వస్తుందని చంద్రబాబు ఏనాడూ ఊహించి ఉండరు.

అధికార పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా ఉండీ లేని జనసేన, అసలు సీట్లే లేని బీజేపీ చేస్తున్న హడావిడి కూడా టీడీపీ చేయలేకపోతోంది. తిరుపతిలో రేపు టీడీపీ పోటీ పడేది రెండో స్థానానికా, లేక మూడో స్థానానికా అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

స్థానిక ఎన్నికలు ఇప్పుడల్లా జరగవు అని నమ్మకం కుదరడం వల్లే.. వైసీపీ ఎన్నికలకు భయపడుతోంది, కార్యకర్తలారా సిద్ధం కండి అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వగలుగుతున్నారు బాబు. కళ్లముందు జరుగుతున్న ఎన్నికలకు ప్రచారం చేయలేరు, కనుచూపు మేరలో జరిగేలా లేవు అనుకున్న వాటిపై మాత్రం సవాళ్లు విసురుతారు. ఇదీ ప్రస్తుతం చంద్రబాబు అవస్థ.

వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని కనుసైగతో రాజకీయం నడిపిన చంద్రబాబు.. ఇప్పుడిలా నిస్తేజ స్థితికి చేరుకున్నారు.

First Published:  24 Nov 2020 8:12 PM GMT
Next Story