Telugu Global
National

పావురాల గుట్ట... సర్జికల్ స్ట్రైక్స్... బీజేపీ ప్రచారం ఎటు పోతోంది..?

మూడు రోజుల క్రితం అసందర్భంగా గ్రేటర్ ప్రచారంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని, పావురాల గుట్టలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసి దుబ్బాక విజేత రఘునందన్ రావు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానుల మనసుల్ని గాయపరిచారు. ఆ తర్వాత తప్పు సరిదిద్దుకోవాలని చూసినా… మాటలతో అయిన గాయానికి కనీసం కొంతమంది అయినా ఓట్లతో బదులు తీర్చుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నిన్నటి వరకూ అదే పెద్ద తప్పుగా కనిపించింది. కానీ అంతకంటే పెద్ద మాట మాట్లాడి రఘునందన్ రావు […]

పావురాల గుట్ట... సర్జికల్ స్ట్రైక్స్... బీజేపీ ప్రచారం ఎటు పోతోంది..?
X

మూడు రోజుల క్రితం అసందర్భంగా గ్రేటర్ ప్రచారంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని, పావురాల గుట్టలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసి దుబ్బాక విజేత రఘునందన్ రావు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానుల మనసుల్ని గాయపరిచారు.

ఆ తర్వాత తప్పు సరిదిద్దుకోవాలని చూసినా… మాటలతో అయిన గాయానికి కనీసం కొంతమంది అయినా ఓట్లతో బదులు తీర్చుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నిన్నటి వరకూ అదే పెద్ద తప్పుగా కనిపించింది.

కానీ అంతకంటే పెద్ద మాట మాట్లాడి రఘునందన్ రావు వ్యవహారాన్ని చిన్నదిగా మార్చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఆవేశంలో నోరు జారారు.

ఆవేశంలో అన్నారా లేక, హిందువుల ఓట్లని గంపగుత్తగా ఒడిసి పట్టుకునే ఆలోచనతో అన్నారా అనే విషయం పక్కనపెడితే.. హైదరాబాద్ లో మత కల్లోలానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. సర్జికల్ స్ట్రైక్స్ అనే మాటను పదే పదే చెబుతూ.. బీజేపీని టార్గెట్ చేస్తోంది.

పాతబస్తీలో పాకిస్తానీలు, రోహింగ్యాలు ఉన్నారని… వారంతా ఓట్లు వేసి ఎంఐఎంను గెలిపిస్తున్నారనేది బండి సంజయ్ వాదన. అయితే అకస్మాత్తుగా పాతబస్తీ రోహింగ్యాల విషయం గ్రేటర్ ఎన్నికల ముందే సంజయ్ కు గుర్తు రావడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. సున్నితమైన విషయాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూడటం రాజకీయ నాయకులకు అలవాటే. అయితే పోలింగ్ తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందనే విషయమే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు.

నిజంగానే బీజేపీకి అధికారం ఇస్తే… పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే… హైదరాబాద్ అట్టుడికి పోదా? ఇప్పటికే బండికి బండి, కారుకు కారు, ఫర్నిచర్ కి ఫర్నిచర్ అంటూ వరద హామీలతో బండి సంజయ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టికెట్ల కేటాయింపులో తీవ్రంగా మోసం చేశారన్న సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు దీనికి అదనం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు సంజయ్.

కనీసం బీజేపీ సీనియర్ నేతలు కూడా ఆయన వ్యాఖ్యల్ని సమర్థించలేని, ఖండించలేని పరిస్థితి. సంజయ్ వ్యాఖ్యలపై ఏమంటారు కిషన్ రెడ్డి గారూ అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ బరిలో వినిపిస్తున్న ఈ మాటలన్నీ బీజేపీకి లాభమా, నష్టమా అనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది.

First Published:  24 Nov 2020 9:39 PM GMT
Next Story