తిరుపతికి పనబాక ఓకే… ఫలించిన సోమిరెడ్డి దౌత్యం…

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరుని ప్రకటించిన చంద్రబాబు.. అటువైపు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వారం రోజులుగా తెగ ఇబ్బంది పడ్డారు.

వాస్తవానికి పనబాక లక్ష్మికి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం, అందులోనూ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడం సుతరామూ ఇష్టంలేదు. వైసీపీతో మంతనాలు చేయాలని చూసినా.. అవి జగన్ వరకూ వెళ్లలేదు. దీంతో తనను అభ్యర్థిగా ప్రకటించినా కూడా పనబాక లక్ష్మి మౌనాన్నే ఆశ్రయించారు. ఈలోగా వైరి పక్షాలు చంద్రబాబుని టార్గెట్ చేశాయి. అభ్యర్థి కూడా కరువయ్యారంటూ విమర్శలు మొదలు పెట్టాయి.

దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో బాబు రాయబారం పంపారు. పలు దఫాలు చర్చలు జరిగిన అనంతరం తిరుపతి బరిలో టీడీపీ అభ్యర్థిగా దిగేందుకు పనబాక అంగీకరించారు. ఈ అంగీకారానికి గుర్తుగా పనబాక దంపతులు చంద్రబాబుని నేరుగా కలసి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి వచ్చారు. వారివెంట సోమిరెడ్డి కూడా ఉన్నారు.

కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న పనబాక దంపతులు.. టీడీపీ తరపున అయిష్టంగానే బరిలో దిగుతున్నారు. అయితే పూర్తిగా పార్టీ ఆర్థిక సాయం చేస్తేనే తాము బరిలో దిగుతామనే మెలిక పెట్టారు. ఈ విషయంపైనే ఇప్పటి వరకూ తర్జన భర్జనలు సాగాయి. చివరకు సోమిరెడ్డి మంతనాలు ఫలించి పనబాక లక్ష్మి సైకిల్ గుర్తుపై తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి సుముఖత ప్రకటించారు.

అటు వైసీపీ దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చి, డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయిస్తోంది.

ఇక బీజేపీ, జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాలేదు.

మొత్తమ్మీద నోటిఫికేషన్ వెలువడక ముందే తిరుపతి ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది.