Telugu Global
International

ఆ దేశంలో మహిళలందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ !

మహిళల ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచేదిశగా స్కాట్ లాండ్ ప్రభుత్వం ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో మహిళలందరికీ నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్ ని, టాంపూన్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. స్కాట్ లాండ్ పార్లమెంటు మంగళవారం నాడు ఇందుకు సంబంధించిన బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘నెలసరి పేదరికం’ అనే పదాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ బిల్లు ప్రకారం ఒక జాతీయ స్థాయి పథకాన్ని ప్రవేశపెట్టి… పీరియడ్ ప్రొడక్టులు […]

ఆ దేశంలో మహిళలందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ !
X

మహిళల ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచేదిశగా స్కాట్ లాండ్ ప్రభుత్వం ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో మహిళలందరికీ నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్ ని, టాంపూన్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.

స్కాట్ లాండ్ పార్లమెంటు మంగళవారం నాడు ఇందుకు సంబంధించిన బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘నెలసరి పేదరికం’ అనే పదాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ బిల్లు ప్రకారం ఒక జాతీయ స్థాయి పథకాన్ని ప్రవేశపెట్టి… పీరియడ్ ప్రొడక్టులు అవసరం ఉన్న ప్రతి మహిళకు వాటిని ఉచితంగా అందిస్తారు. స్కూళ్లు కాలేజీలు యూనివర్శిటీల్లో సైతం వీటిని ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం సంవత్సరానికి 87 లక్షల పౌండ్లు ఖర్చవుతాయని అంచనా.

ఎంతమంది మహిళలు తమకు నెలసరి ఉత్పత్తులు ఉచితంగా కావాలని ముందుకు వస్తారు… అనేదాన్ని బట్టి ఈ ఖర్చు కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. పార్లమెంటులో ఉచిత పీరియడ్ ప్రొడక్టుల బిల్లుని ప్రవేశపెట్టిన సభ్యురాలు మోనికా లెన్నన్… దేశంలో ‘నెలసరి పేదరికం’ అనేది లేకుండా చేయాలనే ప్రచారాన్ని 2016 నుండి చేస్తున్నారు. తమదేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచమే నెలసరి సామగ్రిని ఉచితంగా అందించే దిశగా అడుగులు వేస్తుందన్నారామె.

తాము తీసుకున్న ఈ నిర్ణయంపై స్కాట్ లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జియాన్ ట్విట్టర్లో స్పందిస్తూ… సంచలనాత్మకమైన ఈ చట్టాన్ని తెచ్చేందుకు ఆమోదం తెలిపినందుకు, ప్రపంచంలోనే ఇలాంటి పథకాన్ని ప్రవేశ పెడుతున్న మొదటి దేశం తమదే అయినందుకు గర్వంగా ఉందన్నారు. మోనికా లెన్నన్ కి అభినందనలు తెలిపారామె.

నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్ ని కొనే స్థోమత లేకపోవటం వలన వాటిని పొందలేకపోవడాన్ని నెలసరి పేదరికంగా పిలుస్తున్నారు. స్కాట్ లాండ్ లోని కాలేజీలు, స్కూళ్లు యూనివర్శిటీల్లో చదువుకుంటున్న రెండువేల మంది విద్యార్థినులను ప్రశ్నించి నిర్వహించిన ఒక సర్వేలో… సమాధానం చెప్పిన ప్రతి నలుగురిలో ఒకరు పీరియడ్ ప్రొడక్టులను కొనలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆ దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. స్కాట్ లాండ్ ఈ విషయంలో ఇతర దేశాలకు స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం…

First Published:  25 Nov 2020 4:17 AM GMT
Next Story