పార్టీ మారకముందే… స్టాండ్​ మార్చిన రాములమ్మ…!

కాంగ్రెస్​ నాయకురాలు విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను రాములమ్మ గానీ ఇటు బీజేపీ వర్గాలు కానీ ఖండించలేదు.. ధ్రువీకరించలేదు.

ఈ నేపథ్యంలో విజయశాంతి పెట్టిన ట్వీట్లు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​కి ఆమె మద్దతుగా ట్వీట్లు పెట్టారు. హైదరాబాద్​ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థాన్​ వాళ్లు ఉన్నారని వాళ్లను తరిమికొట్టేందుకు సర్జికల్​ స్ట్రైక్స్​ నిర్వహిస్తామంటూ బండి సంజయ్​ అన్నారు. ఈ మాటలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.

టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ.. సంజయ్​ వ్యాఖ్యలను ఖండించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్​లో బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారని వాళ్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ నేత విజయశాంతి సంజయ్​కు మద్దతుగా ట్వీట్లు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.

‘గతంలో ఓవైసీ ఎన్నోసార్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 10 నిమిషాలు టైం ఇస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానించారు. మేం ఉమ్మేస్తే చార్మినార్​ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్​ మునిగిపోతుందని అన్నారు. నేరుగా ఓ డీజీపీని పట్టుకొని యూనిఫామ్​ వదిలి రా చూసుకుందాం.. అని సవాల్​ విసిరారు.. అప్పుడు టీఆర్​ఎస్​ నేతలు కనీసం ఒవైసీ మాటలను ఖండించలేదు. పైగా ఎంఐఎం, టీఆర్​ఎస్​ మిత్రపక్షాలుగా చలామణి అయ్యాయి.

ఇటీవల కూడా ఓవైసీ ప్రగతిభవన్​కు వెళ్లి సీఎం కేసీఆర్​తో సమావేశమయ్యారు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని మళ్లీ ఇద్దరూ డ్రామాలు మొదలుపెట్టారు. బండి సంజయ్​ వ్యాఖ్యల్లో తప్పేముంది. నిజంగా కేసీఆర్​కు ధైర్యం ఉంటే పాతబస్తీ మొత్తం సర్వే చేయించాలి. ఇక్కడ ఉన్న రోహింగ్యాలను, పాకిస్థాన్​ వాళ్లను గుర్తించాలి. అంతేకాని బండి సంజయ్​ మీద ఎదురు దాడి చేయడం ఏమిటి’ అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు పెట్టారు.

అయితే పార్టీ మారకముందే రాములమ్మ తన స్టాండ్​ను మార్చుకున్నారని సోషల్​మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు రేపో మాపో విజయశాంతి బీజేపీలో అధికారికంగా చేరతారని ప్రచారం జరుగుతున్నది. జీహెచ్​ఎంసీ ప్రచారంలో భాగంగా అమిత్​ షా హైదరాబాద్​కు రానున్నారు. అప్పుడు విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.