ఏబీ వెంకటేశ్వరరావుకి సుప్రీంలో చుక్కెదురు…

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఆటోమేటిక్ గా అమలులోకి వచ్చినట్టయింది.

అసలేంటి వ్యవహారం…

చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని, అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో వైసీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది.

దీంతో ఆయన తన సస్పెన్షన్ వ్యవహారాన్ని క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో సవాలు చేసారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్యాట్ లో ఆయనకు చుక్కెదురైంది. డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో ఏబీని సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని క్యాట్ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది.

అయితే ఏబీ అక్కడితో ఆగలేదు. క్యాట్ కూడా తనకు అనుకూలంగా చెప్పకపోవడంతో సస్పెన్షన్ వ్యవహారాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏబీపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ… హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సస్పెన్షన్ ఉత్తర్వుల రద్దుకోసం శత విధాలా ప్రయత్నిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.