రైతులపై టియర్ ​గ్యాస్​… ఛలో ఢిల్లీ హింసాత్మకం

రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతువ్యతిరేక చట్టాలపై ఆందోళన తీవ్రతరమవుతోంది. రెండు రాష్ట్రాలకే పరిమితమవుతుందనుకున్న ఉద్యమం ఉత్తరాది మొత్తం వ్యాపించింది. పంజాబ్​, హర్యానా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందనుకున్న నిరసన మిగతా రాష్ట్రాలను తాకింది.

ఉత్తరాదిలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మధ్యప్రదేశ్​ రైతులు సైతం నిరసనలో పాల్గొంటున్నారు. ఇవాళ వివిధ రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఛలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర రూపం దాల్చింది.

ఢిల్లీకి వెళ్లకుండా హర్యానా సరిహద్దుల్లోనే రైతులను నిలువరించాలని పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. కానీ రైతులు కూడా పోలీసులను ప్రతిఘటించి ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పటికే రైతులపై జలఫిరంగులు ఎక్కుపెట్టారు. టియర్​గ్యాస్​ ప్రయోగించారు. అయినప్పటికీ అన్నదాతలు ముందుకే కదిలారు. భారీకేడ్లను తెంచేసి ముందుకు సాగుతున్నారు.

పలు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ రైతన్నలను అరెస్ట్​ చేసినప్పటికీ ఆందోళన మాత్రం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సాయుధ బలగాలు రైతులను ఢిల్లీకి అడుగుపెట్టనీయకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే రైతులు మాత్రం తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తామంటూ ముందుకే కదులుతున్నారు.

ఢిల్లీకి ఉన్న అన్ని మార్గాలగుండా రైతన్నలు కదం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో రైతుల ర్యాలీకి ఢిల్లీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.

పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. రైతులపై టియర్​గ్యాస్​ ప్రయోగించడం ఏమిటని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బీజేపీ రైతుల హక్కులను కాలరాస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ చట్టాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్​ వ్యతిరేకించారు. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాళిదళ్​ తన మద్దుతునే ఉపసంహరించుకున్నది. ముఖ్యంగా పంజాబ్​, హర్యానాల్లో ఈ చట్టం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అక్కడ రైతులు ఇప్పటికే పలుమార్లు తమ నిరసన తెలిపారు. తాజాగా చేపట్టిన ఛలోఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.