దుబ్బాక వర్సెస్ జీహెచ్ఎంసీ… హరీష్ వర్సెస్ కేటీఆర్…

సింపతీ ఓట్లతో సులభంగా నెగ్గాల్సిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు దాదాపుగా తెరమరుగయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికను అంతా తానై ముందుండి నడిపించినా కూడా ఫలితం తేడాగా వచ్చే సరికి పార్టీలో హరీష్ రావు హవా కాస్త తగ్గిందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచి ఉంటే.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హరీష్ రావు హవా కనిపించేది. ప్రచారంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించి ఉండేవారు. కానీ అక్కడ ఓటమి భారంతో హరీష్ జీహెచ్ఎంసీకి మొహం చాటేశారు.

ప్రస్తుతం గ్రేటర్ లో టీఆర్ఎస్ కి ఏకైక గొంతుకగా వినిపిస్తున్నారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. కేసీఆర్ సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే.. కేటీఆర్ అభ్యర్థులను వెంటబెట్టుకుని బహిరంగ సభలు, ర్యాలీలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నా.. హరీష్ రావు పేరు మాత్రం ఎక్కడా వినిపించడంలేదు, ఆయన కనిపించడంలేదు. కనీసం గ్రేటర్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో కూడా హరీష్ రావు ప్రమేయం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఆ విషయం పక్కనపెడితే.. గ్రేటర్ లో 100 సీట్లు సాధిస్తామంటూ ఢంకా భజాయిస్తున్నారు కేటీఆర్. అటు బీజేపీ, ఇటు ఎంఐఎం నేతలిద్దరూ నోరు జారుతున్నా.. తాను మాత్రం ఎక్కడా ఆవేశానికి లోను కాకుండా ప్రచార జోరు చూపిస్తున్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా మాట్లాడుతున్నారంటూ బీజేపీ, ఎంఐఎం నేతలపై విరుచుకుపడుతున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అన్ని పార్టీలకు ప్రధాన అజెండాగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధి అంశం ఇప్పుడు పక్కకుపోయింది. హైదరాబాద్ లో మత సామరస్యం ప్రధాన అజెండాగా మారింది. ఇది టీఆర్ఎస్ కి అనుకోని వరంగా మారింది. ఈ దశలో కేటీఆర్ మంత్రాంగం ఫలించి జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సెంచరీ కొడితే.. ఆయన పార్టీలో తిరుగులేని శక్తిగా అవతరిస్తారనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పటికే భావి సీఎంగా ప్రచారం పొందిన కేటీఆర్ ఆ కుర్చీ ఎక్కేందుకు పూర్తి అర్హత సాధించినట్టవుతుంది. ఆమధ్య కావాలనే హరీష్ కి ప్రాధాన్యం తగ్గించారని అపవాదు ఎదుర్కొన్న కేసీఆర్ కాస్త ఆలస్యంగా అయినా మేనల్లుడికి ఆర్థిక శాఖ అప్పగించి అశాంతిని చల్లార్చారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ లో ఎవరి సత్తా ఏంటో.. జీహెచ్ఎంసీ ఫలితంతో తేలిపోతే.. కొడుకు విషయంలో కేసీఆర్ మరీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదనే విషయం అందరికీ అర్థమవుతుంది.