తిరుపతిపై జనసేనానికి క్లారిటీ వచ్చినట్టేనా…?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తిరుపతి ఎన్నిక అభ్యర్థిపై గందరగోళం పెంచాయి. తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన అభ్యర్థిత్వంపై కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురైంది.

“తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై మాట్లాడుకున్నాం. బీజేపీ, జనసేన అభ్యర్థుల్లో ఎవరు పోటీ చేయాలన్నది అంతర్గత కమిటీ వేసి, చర్చించుకొని ముందుకెళ్తాం”అని నడ్డాతో భేటీ అనంతరం స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అంటే జనసేనకు టికెట్ ఇస్తారనే విషయంపై చూచాయగా కూడా ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు పవన్. అంతర్గత కమిటీ, చర్చలు అంటే.. కచ్చితంగా పవన్ ని వారు కన్విన్స్ చేసే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి.

తిరుపతి టికెట్ పై హామీ లభించి ఉంటే.. మీడియా ముందుకొచ్చిన పవన్ లో కచ్చితంగా ఉత్సాహం కనిపించేది. కానీ అలాంటిదేదీ కనిపించకపోయే సరికి పవన్ కి ఆల్రడీ తిరుపతి టికెట్ పై క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు. కమిటీ, చర్చల పేరుతో కాలయాపన చేసి చివరకు జీహెచ్ఎంసీ ఫలితాలు ఆశాజనకంగా ఉంటే.. అదే ఊపులో తిరుపతి టికెట్ కూడా బీజేపీయే తీసుకునే అవకాశాలున్నాయనేది మరో వాదన. అందుకే పవన్ జనసైనికులు సిద్ధంగా ఉండండి అంటూ హస్తిన నుంచి పిలుపు ఇవ్వలేకపోయారు.

అబ్బెబ్బే తిరుపతికోసం కాదు…

ఇక పవన్ తో పాటే నడ్డాతో భేటీలో పాల్గొన్ననాదెండ్ల మనోహర్ అసలు తిరుపతి విషయం కోసం ఇంతదూరం రావాలా అని మీడియాని ఎదురు ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నిక సీటు కోసం ఢిల్లీకి వచ్చినట్లు జరిగిన ప్రచారాన్ని మనోహర్ ఖండించారు. “కేవలం ఉప ఎన్నిక కోసం ఇంతదూరం రావాల్సిన అవసరం లేదు. జనసేన తరఫున తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చిస్తాం తప్ప రాజకీయాల కోసం కాదు.” అని అన్నారు మనోహర్.

పవన్, మనోహర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తిరుపతి సీటుపై జనసేనకు ఎలాంటి హామీ లభించలేదని, భవిష్యత్తులో కమిటీ వేసి చర్చించినా కూడా విస్తృత ప్రయోజనాలకోసం ఆ సీటుని బీజేపీకే జనసేన త్యాగం చేస్తుందనే విషయం స్పష్టమవుతోంది. సో.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇక బీజేపీ నుంచి అభ్యర్థి అనౌన్స్ మెంట్ జరగాల్సి ఉందన్నమాట.