కమలం గూటికి స్వామి గౌడ్… టీఆర్‌ఎస్‌ రిటర్న్‌ గిప్ట్‌ ఇస్తుందా?

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగా శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను పార్టీలో చేర్చుకుంది. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్‌ కమలం కండువా కప్పుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్‌ చురుగ్గా పాల్గొన్నారు. టీఎన్జీవో నేతగా ఉద్యమంలో యాక్టివ్‌ రోల్‌ పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ అయ్యారు. శాసనమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ నుంచి ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్‌ ఎందుకో ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో అలిగిన స్వామిగౌడ్‌ అప్పటినుంచి పక్క చూపులు చూస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లోనే స్వామిగౌడ్‌ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి వస్తుందని స్వామిగౌడ్‌ ఆశించారు. కానీ రెండేళ్లు అయినా ఏ పదవీ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటు కమలం నేతలు కూడా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెట్టే ప్రయత్నంలో స్వామిగౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ ఒకటి లోపు మరింతమంది నేతలను పార్టీలోకి ఆహ్వానించే ఎత్తుగడలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది .

దుబ్బాక ఎన్నికల టైమ్‌లో బీజేపీ నేత శ్రీధర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు బీజేపీకి షాక్‌ ఇచ్చామని టీఆర్‌ఎస్‌ అనుకుంది. అయితే అక్కడ గెలవకపోవడంతో ఆ పాచిక పారలేదు. అయితే స్వామిగౌడ్‌ వెళ్లిపోవడంతో ఇప్పుడు బీజేపీకి టీఆర్‌ఎస్‌ రిటర్న్‌ గిప్ట్‌ ఇస్తుందా? హైదరబాద్‌లో కీలక బీజేపీ నేతలకు గాలం వేస్తుందా? లేదా? అనేది చూడాలి.