Telugu Global
National

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత... రైతులతో మాట్లాడాలని మోదీకి పంజాబ్ సీఎం సూచన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల రైతు సంఘాలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన 200 రైతు సంఘాల నేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఛలో ఢిల్లీకి వేలాదిగా తరలి వెళ్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు […]

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత... రైతులతో మాట్లాడాలని మోదీకి పంజాబ్ సీఎం సూచన
X

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల రైతు సంఘాలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన 200 రైతు సంఘాల నేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఛలో ఢిల్లీకి వేలాదిగా తరలి వెళ్తున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

పోలీసులు రైతుల పై టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించినా వారు వెనక్కి తగ్గలేదు. బారికేడ్లు, ఇనుప కంచెలను తొలగించి పోలీసులకు ఎదురు వెళ్లారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు అడ్డుకున్నా ఢిల్లీకి వెళ్లి తీరుతామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

రెండు నెలలకు సరి పడా ఆహారం

కాగా ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాల నేతలు.. పోలీసులు ఎంత అడ్డుకున్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఎన్ని రోజుల ఆలస్యమైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వం రోడ్డు పైకి వచ్చి రైతులతో మాట్లాడే వరకు, తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తరఫున ఎవరొచ్చి మాట్లాడినా చర్చలు జరపమని నేరుగా ప్రధాని మోదీతోనే చర్చలు జరుపుతామని తేల్చి చెబుతున్నారు. కార్యక్రమం ఆలస్యమైనా ఇబ్బందులు రాకుండా ట్రాక్టర్లలో బస్తాల కొద్దీ బియ్యం, ఉల్లిగడ్డలు, దుప్పట్లు, వంట సామాగ్రి వెంట తెచ్చుకున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.

కాగా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న దశలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలను సృష్టిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్పందించి రైతు సంఘాల నేతలతో మాట్లాడాలని సూచించారు. ఇప్పటికే రైతుల ఆందోళన రోజురోజుకూ ఉధృతంగా మారుతోందని, దీన్ని అలాగే వదిలేస్తే మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆయన సూచించారు.

First Published:  27 Nov 2020 4:56 AM GMT
Next Story