బీజేపీతో నడక సాగుతుందా… జన సైనికుల్లో అనుమానాలు

గత ఎన్నికల్లో గెలిచింది ఒక్క సీటు అయితే ఏమి… రాష్ట్రంలో జనసేన 6 శాతం ఓట్లు సాధించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో పలు జిల్లాల్లో రెండవ స్థానంలో నిలిచింది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గణనీయమైన ఓట్లు వచ్చాయి. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం ఓట్లు వచ్చినా కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యిందంటే కారణం ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు పోలైన ఓట్లు భారీగా ఉండటమే.

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చేసిన పుంగనూరులోనూ జనసేన అభ్యర్థికి 16 వేల ఓట్లు వచ్చాయి. ఇక తిరుపతిలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం, అభిమానుల బలం అధికంగా ఉండటంతో అక్కడ కూడా జనసేనకు సుమారు 20 వేల ఓట్లు వచ్చాయి.

ఇక బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ, ఎంపీ సీటు కూడా గెలవలేక పోయింది. కనీసం రెండో స్థానం, మూడో స్థానం కూడా రాలేదు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి తెలంగాణలో ఉన్న బలం వేరు… ఏపీలో ఉన్న బలం వేరు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు లేదు.

దుబ్బాకలో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాం అని బీరాలు పలికారు. కనీసం జనసేనతో కలసి నడుస్తున్నాం.. ఒక మాట పవన్ తో మాట్లాడదాం.. అని కూడా ఆ పార్టీ నేతలు ఆలోచించలేదు.

తిరుపతి సీటు విషయం తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్ కు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడు రోజులకు గానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంత వెయిట్ చేయించి కూడా ఎటూ తేల్చకుండా ఓ కమిటీ వేశారు. దాని ప్రకారం ఏ పార్టీ తరపున అభ్యర్థిని ఎంపిక చేయాలో నిర్ణయిద్దాం అని చెప్పి పవన్ ను తిప్పి పంపారు.

గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానంలో జనసేనకు 20 వేలకు పైగా ఓట్లు రాగా… బీజేపీ అభ్యర్థికి కనీస ఓట్లు కూడా రాలేదు. అక్కడ బీజేపీతో పోల్చితే జనసేనకే ఎక్కువ బలం ఉందని తెలిసినా.. అభ్యర్థిని తేల్చడంలో బీజేపీ అధిష్టానం పెద్దలు నాన్చుడు ధోరణిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఒక్క సీటు విషయాన్నే ఇంత నాన్చుతున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎంత ప్రాధాన్యం ఇస్తుంది.. పవన్ కు అసలు విలువ ఉంటుందా? అని జన సైనికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.