నూరేళ్ల జీవితం… చెడు అలవాట్లే కారణమా? !

సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే.. తప్పకుండా మంచి అలవాట్లు ఉండితీరాలి. ఇదే కదా మనమంతా అనుకునేది. కానీ చైనాకు చెందిన జాంగ్ కెమిన్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాడు. ఇతను జూన్ 27న నూరో పుట్టినరోజు జరుపుకున్నాడు. తను ఇంత సుదీర్ఘకాలం జీవించడానికి దోహదం చేసిన అంశాలు… సిగరెట్, ఆల్కహాల్, ఆరోగ్యకరమా… కాదా… అని ఆలోచించకుండా తనకు ఏది నచ్చితే దానిని తినటమే అంటున్నాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో అతను ఈ వివరాలు తెలిపాడు.

తను ఎప్పటినుండో ఇలాగే బతికేస్తున్నానని, తన ఆరోగ్యానికి ఏమవుతుందో అనే ఆందోళన కానీ, భయం కానీ తనకెప్పుడూ లేవని అతను వివరించాడు. సిగరెట్లు, ఆల్కాహాల్… ఈ రెండు అలవాట్లంటే తనకు చాలా వ్యామోహమని… అయితే తొంభై ఏళ్లు దాటాక మాత్రం పనిచేస్తున్నపుడు ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆల్కాహాల్ తీసుకోవటం కాస్త తగ్గించానని జాంగ్ కెమిన్ తెలిపాడు.

ఇరవై ఏళ్ల వయసులో అతను సిగరెట్లను అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికీ ప్రతిరోజు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగుతున్నాడు. ఈ రోజు వరకు జాంగ్ కెమిన్ కి కాస్త వినికిడి సమస్య తప్ప చెప్పుకోదగిన పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవు. అయితే సిగరెట్, ఆల్కాహాల్ అలవాట్లు మంచివా కావా… అనే ప్రశ్నకు తాను ఇప్పుడు సమాధానం చెప్పలేనంటున్నాడు జాంగ్. అతనిప్పుడు తన వారసులైన ఐదుతరాల వారితో కలిసి ఉంటూ హాయిగా సిగరెట్లు తాగుతూ, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

చెడు అలవాట్ల సంగతి పక్కనపెడితే జాంగ్ కి జీవితం అంటే చాలా ఇష్టమని… తనకు నచ్చినవాటిని  చాలా ఇష్టంగా తీసుకుంటున్నాడని కూడా అర్థమవుతోంది. జాంగ్ సుదీర్ఘ జీవితం విషయంలో అతని మనస్తత్వం ప్రధాన కారణం అయివుంటుందేమో…!