మహిళా ఖైదీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం క్షమాభిక్ష

ఆవేశంలో, తెలిసీ తెలియక, పొరపాటున చేసిన నేరాలకు ఎంతో మంది చాలా ఏళ్లుగా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నారు. ఇన్నాళ్ల శిక్షలో తమ పొరపాట్లను తెలుసుకొని పరివర్తన చెందారు. వీరందరూ జైళ్లలో పలు అంశాల్లో శిక్షణ కూడా పొందారు. గత కొన్నాళ్లుగా వీళ్లు క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. వీరి అభ్యర్థనను పరిశీలించిన వైఎస్ జగన్ ప్రభుత్వం మానవత్వంతో 53 మంది ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు కేంద్ర కారాగారాల్లో శిక్షను అనుభవిస్తున్న 53 మంది మహిళా ఖైదీలు విడులయి బయటకు వచ్చారు. అయితే వీరందరూ బహిరంగ జీవితం గడపడానికి కొన్ని నిబంధనలను జైళ్ల శాఖ విధించింది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పోలీసుల ముందు హాజరవడమే కాకుండా.. ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలు పంచుకోవద్దని హెచ్చరించింది.

వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తొలి సారి మహిళా ఖైదీలు తిరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలకు ఎంపీ మార్గాని భరత్ అభినందనలు తెలపడమే కాకుండా.. అవసరమైన నిత్యావసర సరుకులు , ఇంటికి చేరడానికి అవసరమైన డబ్బులను అందించారు.