‘ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’… ప్రకాశ్​రాజ్​ కు నాగబాబు కౌంటర్

ఇటీవల ఓ టీవీచానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్​రాజ్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ముఖ్యంగా జనసేనకు విపరీతమైన కోపం తెప్పించాయి. ఏకంగా వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లాయి.

ప్రకాశ్​ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ ​కల్యాణ్ సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పవన్​కల్యాణ్​ నేతృత్వంలోని జనసేన పోటీచేయకపోవడంపై ప్రకాశ్​ రాజ్​ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ఊసరవెల్లితో పోల్చారు.

‘బీజేపీ బలం ఏమిటో పవన్​కల్యాణ్​కు తెలియదా? వాళ్లతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. రాజకీయాల్లో స్థిరత్వం అనేది ఉండాలి. కానీ పవన్​కల్యాణ్​ మాత్రం స్థిరత్వం లేని ఓ ఊసరవెల్లి. తన అవసరాల కోసం రాజకీయాలను వాడుకుంటాడు’ అని ప్రకాశ్​రాజ్​ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. దీనిపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పై విమర్శల దాడి చేశారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై పవన్ ​కల్యాణ్​ సోదరుడు నాగబాబు స్పందించారు. ప్రకాశ్​రాజ్​పై వ్యక్తిగత దాడికి దిగాడు.

‘రాజకీయాల్లో నిర్ణయాలు మారుతుంటాయి. వాటికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. పవన్​కల్యాణ్​ ఓ పార్టీకి అధినేత. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి. పవన్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. దేశంలో బీజేపీతో, ఏపీలో జనసేనతోనే అభివృద్ధి సాధ్యం’ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇద్దరు నటుల మధ్య జరుగుతున్న ఈ వార్ సోషల్​మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.