గ్రేటర్‌లో ఆ 48 డివిజన్లే కీలకం… బీజేపీ ఆశలు కూడా ఈసీట్ల పైనే !

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం హోరెత్తిస్తోంది. ఒక రకంగా వివిధ రాష్ట్రాల నేతల ప్రచారాలతో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తోంది. గల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు పూర్తిగా హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టారు. వేరే రాష్ట్రంలో ఎన్నికలు లేకపోవడంతో పూర్తిగా ఇక్కడ సమయం కేటాయిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా హిందీబెల్ట్‌లో కీలకంగా ఉన్న రాష్ట్రాల ప్రజలు 13 శాతం మంది ఉన్నారు. పాతబస్తీతో పాటు కొత్త నగరంలో వీరి ఓట్లు కీలకం. 48 డివిజన్లలో గెలుపోటములను వీరు ప్రభావితం చేయబోతున్నారు. ఈ డివిజన్లే టార్గెట్‌గా కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.

మొత్తం 150 డివిజన్లలో బీజేపీ కేవలం 70 నుంచి 75 సీట్లపైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎలాగైనా 50 ప్లస్ సీట్లు గెలిచి సత్తా చాటాలనేది బీజేపీ ప్రయత్నం.

మరోవైపు బీజేపీకి క్యాండిడేట్లు మైనస్‌గా మారారు. పెద్దగా జనానికి తెలియని వారికి టికెట్లు ఇవ్వడంపై కార్యకర్తల నుంచి రెస్పాన్స్‌ రావడం లేదు. పలు డివిజన్లలో అసలు జనాలకు తెలియని వ్యక్తులు కావడంతో ప్రత్యామ్నాయాలపై ఓటర్లు దృష్టిపెట్టారు. తమకు తెలిసిన… అందుబాటులో ఉండే నేతకు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.