అందర్నీ ఆశ్చర్యపరిచేలా కేసీఆర్ ప్రసంగం…

కేసీఆర్ ప్రసంగం అంటే.. తిట్లూ, శాపనార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాడెవడు వాడు, వాడి పేరేంటి అంటూ.. పక్కనోళ్లని అడిగినట్టుగానే అడిగి తిట్టిపోస్తుంటారు కేసీఆర్. అలాంటి కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో తన మేనరిజాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఆవేశం లేదు, ఆక్రోశం లేదు. తిట్లు, శాపనార్థాలు అంతకంటే లేవు. అసలు కేసీఆరే మాట్లాడుతున్నారా అంటూ ఆశ్చర్యపరిచేలా ప్రసంగించారు. తన మార్కు చెణుకుల్ని మాత్రం మిస్ కాకుండా చూసుకున్నారు.

“కొంతమంది నన్ను కూడా ఏకవచనంతో సంబోధిస్తున్నారు. చిల్లర మాటలకు ఆవేశపడం. నేను కూడా బ్రహ్మాండంగా తిట్టగలను.. కానీ సంయమనం పాటిస్తున్నా. మా బాసులు ఢిల్లీలో ఉండరు.. తెలంగాణ ప్రజలే మా బాసులు. ఎవరికీ భయపడం.. ఎక్కడా రాజీపడం. నగర భవిష్యత్‌కు యువత, మేధావులు కంకణం కట్టాలి. జీహెచ్‌ఎంసీలో బ్రహ్మాండంగా విజయం సాధించబోతున్నాం. గతం కంటే నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయి. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ దీవించాలి.” అంటూ ప్రసంగాన్ని ముగించారు కేసీఆర్. నేను కూడా తిట్టగలను, కానీ తిట్టను అంటూనే అందరికీ చురకలంటించారు.

బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? అంటూ ప్రశ్నించిన కేసీఆర్.. వరదలపై రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరితే 13 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. “బెంగళూరు, అహ్మదాబాద్‌కు ఇవ్వలేదా? మేమేం తప్పుచేశాం? ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టి బుద్ధి చెప్పాలో నిర్ణయించుకోండి. వరదసాయం ఇవ్వలేదు కానీ.. నగరానికి వరదలా వస్తున్నారు. ఇవి మున్సిపల్‌ ఎన్నికలా? జాతీయ ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ వస్తారా? రక్తం, పౌరుషం ఉన్న కేసీఆర్‌ మీ బిడ్డ. మళ్లీ చెబుతున్నా.. ఆ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయి. సరైన విద్య, వైద్యం ఎందుకు లేదు? ఆకలి బాధలు ఇంకా ఎందుకు ఉన్నాయి? ఇళ్లులేని పేదలు ఇంకా ఎందుకు ఉన్నారు? ప్రజలు ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి.

దేశంలో కొత్త పంథా రావాలి.. కొత్త ఆవిష్కరణ జరగాలి.. మూస రాజకీయం పోవాలి. దేశం, ప్రజల కోసం మాట్లాడితే తప్పా? నేను ఇలా అంటుంటే ఢిల్లీలో ఎందుకు గజగజ వణుకుతారు? నగర చైతన్యాన్ని దేశానికి విస్తరించాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారా ఆ సందేశం ఇవ్వాలి. 40 కోట్ల సభ్యులు, రూ.30 లక్షల కోట్ల ఆస్తి ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు?” అని ప్రశ్నించారు.

“అంతకుముందు కేసీఆర్‌ ఉద్యమనాయకుడు. ప్రసంగాలకు ప్రజలు చెవికోసుకుని వినేవారు. లక్షల మంది సభలకు హాజరయ్యేవారు. దేశం ఆశ్చర్యపోయే సభలు జరిగాయి. అది రాష్ట్రం ఏర్పడేవరకు ఉన్న చరిత్ర. ఉద్యమం గమ్యాన్ని ముద్దాడింది. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదని.. ఇక కావాల్సింది రాజకీయ పరిణతి అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆ పరిణతితోనే ప్రవర్తిస్తున్నాం” అని అన్నారు కేసీఆర్.

తాను ఏనాడూ పక్షపాత నిర్ణయాలు తీసుకోలేదని, టీఆర్ఎస్ పథకాలు ఇతర రాష్ట్రాలు, పార్టీలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మిషన్‌ భగీరథ అనే అద్భుత పథకంతో రాష్ట్రంలో దాదాపు 95 శాతం నీటి సమస్యకు భరతవాక్యం పలికామని అన్నారు కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీటి సదుపాయం తేవాలనేది తన కల అని చెప్పారు.

ఎన్నికల్లో గాలివాటంగా ఓటేయకూడదని, ప్రజలు అన్నిటినీ ఆలోచించుకోవాలని చెప్పారు. ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ముక్తాయించారు.

మొత్తమ్మీద దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ పూర్తిగా తన రూటు మార్చారనే విషయం ఆయన ప్రసంగంతో అర్థమవుతుంది. ఎక్కడా విజయంపై అతి విశ్వాసం లేకుండా పూర్తిగా ప్రజల మద్దతుకోరుతూ కేసీఆర్ ప్రసంగం సాగింది. పరుష పదజాలాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకుని, కేవలం సెటైర్లకే పరిమితమై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు కేసీఆర్.