పవన్ సినిమాలపై నివర్ ప్రభావం

వరుసగా సినిమాలైతే ప్రకటించాడు కానీ, వాటికి పడుతున్న అడ్డంకుల్ని మాత్రం తొలిగించలేకపోతున్నాడు పవన్. మొన్నటివరకు కరోనా, ఆ తర్వాత రాజకీయాలు, మధ్యలో గ్రేటర్ ఎన్నికలు.. ఇలా ఎప్పటికప్పుడు పవన్ సినిమాల షూటింగ్స్ కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. వచ్చే నెల నిహారిక పెళ్లి ఉంది. ఆ టైమ్ లో కూడా పవన్ సినిమాల షూటింగ్స్ కు అంతరాయం ఏర్పడబోతోంది. ఇప్పుడు వీటికి తోడుగా మరో అడ్డంకి వచ్చిపడింది. అదే నివర్ తుపాను.

హైదరాబాద్ లో షూటింగ్ కు, ఆల్రెడీ వచ్చి వెళ్లిపోయిన నివర్ తుపానుకు ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. సంబంధం ఉంది. తుపానుతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకుంటున్నారు పవన్. అదే కనుక జరిగితే ఆయన నటిస్తున్న సినిమాలు మరింత ఆలస్యం అవ్వడం ఖాయం.

పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ రీజన్ ఉంది. కొన్ని రోజుల కిందట (వర్షాకాలంలో) భారీ వర్షాలు కురిసినప్పుడు వేలాది ఎకరాల పంట నీటమునిగింది. ఆ టైమ్ లో లోకేష్ లాంటి నాయకులు బాగానే కలియదిరిగారు. కానీ పవన్ మాత్రం కాలు బయటపెట్టలేదు. ఆ టైమ్ లో జనసేనానిపై బాగానే విమర్శలు చెలరేగాయి.

అప్పుడంటే చతుర్మాస దీక్షలో పవన్ ఉన్నాడు కాబట్టి పరామర్శలకు రాలేదు అని జనసైనికులు కవర్ చేశారు. ఇప్పుడు అలా కవర్ చేసే ఆస్కారం లేదు. కాబట్టి పవన్ ఎట్టిపరిస్థితుల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిందే. త్వరలోనే దీనిపై పవన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయంపైనే అతడి కొత్త సినిమా షూటింగ్స్ ఆధారపడి ఉన్నాయి.