నాగబాబూ…! మీ భాష నాకు రాదు… ప్రకాష్ రాజ్ కౌంటర్…

నాగబాబు, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన, బీజేపీ పొత్తుపై విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ కి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఊసరవెల్లిగా మారాడంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఎదురు దాడికి దిగారు. తన తమ్ముడు సొంత లాభం చూసుకోలేదని, ప్రజలకోసం, దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమే నిర్ణయాలు తీసుకున్నారని కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా.. ప్రకాష్ రాజ్ వృత్తిగత జీవితాన్ని కూడా సునిశితంగా విమర్శించారు నాగబాబు. నిర్మాతల్ని మోసం చేస్తారని, కాల్షీట్లిచ్చి షూటింగ్ కి రాకుండా హింసిస్తారని, దర్శకుల్ని గుప్పెట్లో పెట్టుకుని, నిర్మాతలతో ఆడుకుంటారని కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

దీనిపై వెంటనే ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు.

‘మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. అయితే.. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరూ అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ.. మీ భాష రాదు’ అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు ప్రకాష్ రాజ్.

ఒకరకంగా వృత్తిపరమైన విమర్శలు చేసిన నాగబాబుకి ఇలా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారని అర్థమవుతోంది. తాను కేవలం రాజకీయ పరంగా విమర్శలు చేస్తే.. నాగబాబు తన వృత్తిని టార్గెట్ చేయడం ప్రకాష్ రాజ్ కి నచ్చలేదు. అందుకే నాకు మీ భాష రాదు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

అటు పవన్ కల్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై సినీ రంగం నుంచి ఎవరూ స్పందించలేదు. జనసేన పార్టీ తరపున కూడా ఎవరూ ఆ విమర్శలకు బదులివ్వలేదు. ఈ నేపథ్యంలో తమ్ముడి గురించి మాట్లాడిన ప్రకాష్ రాజ్ పై నాగబాబు ఎదురుదాడికి దిగాల్సి వచ్చింది.

దీంతో ఈ దఫా పవన్ కల్యాణ్ తోపాటు, నాగబాబుని కూడా టార్గెడ్ చేశారు ప్రకాష్ రాజ్. తమ్ముడి మీద అన్నకు ఉండే ప్రేమకంటే దేశం మీద ఓ పౌరుడికి ఉండాల్సిన ప్రేమ గొప్పదని పరోక్షంగా విమర్శించారు.

నాగబాబు భాష సరిగా లేదంటూనే.. ఆయన భాషలో తాను సమాధానం చెప్పనంటూ చురకలంటించారు. దీనిపై నాగబాబు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.