రజనీ రాజకీయాల్లోకి వస్తారా… రారా… తేలేది రేపే!

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే విషయమై అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సోమవారం రజనీ మక్కల్ మండ్రం నాయకులతో సమీక్ష నిర్వహించనున్న రజనీ కాంత్ పార్టీ పెట్టాలా… వద్దా.. ఎన్నికల్లో పోటీ చేయాలా… లేదా… అనే విషయమై కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో రజనీకాంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయమై అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావాలని తమిళనాడు ప్రజలు గత పాతికేళ్లుగా కోరుతూ వచ్చారు. అయితే ఆయన ఎప్పటికప్పుడు తన రాజకీయ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయ మరణాంతరం తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మూడేళ్ల కిందట రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ కాంత్ ప్రకటించారు. త్వరలోనే పార్టీ పెడతానని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతూ వచ్చారు.

తమిళనాడులో మరో ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయినా పార్టీ ఏర్పాటుపై రజనీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇంతకు రజనీ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట రజనీకాంత్ ఆరోగ్యం సరిగాలేదని.. నాలుగేళ్ల కిందట ఆయనకు కిడ్నీకి సంబంధించి చికిత్స జరిగిందని.. ఆయన రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఓ లేఖ సోషల్ మీడియాలో విడుదలైంది. ఇది తమిళనాడు లో సంచలనం సృష్టించింది. అయితే అది తాను రాసిన లేఖ కాదని.. ఫేక్ లెటర్ అని రజనీ కాంత్ ఖండించారు. కానీ లేఖ లో ఉన్న విధంగా కొన్నేళ్ల కిందట కిడ్నీ సంబంధిత సమస్యకు చికిత్స పొందినట్లు తెలిపారు.

తమిళనాడులో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారని.. అయితే ప్రజాభిప్రాయం ప్రకారం తాను పార్టీ పెట్టాలా… వద్దా… అనే విషయమై నిర్ణయం తీసుకుంటానని కొద్దిరోజుల కిందట రజనీ కాంత్ ప్రకటించారు.

రజనీ మక్కల్ మండ్రం నేతలతో ఒక సర్వే జరిపి ఆ మేరకు రాజకీయాల్లోకి రావాలా… వద్దా… అనే విషయమై నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజనీ కాంత్ మక్కల్ మండ్రం నేతలతో సమావేశం కానున్నారు. సర్వేలో ప్రజల అభిప్రాయం గురించి వివరాలు ఆరా తీసి.. పార్టీ ఏర్పాటు పై సమీక్ష జరుపనున్నారు.

ఈ సమావేశంలోనే పార్టీ పెట్టడమా… ఆగి పోవడమా… అనే విషయమై రజనీ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. దీంతో తమిళనాడు ప్రజల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తలైవా రేపు జరిగే కార్యక్రమంలో రాజకీయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.