తొలిరోజే ఏపీ అసెంబ్లీలో రభస…

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి వాదనలు జరిగాయి. చివరకు చంద్రబాబు కూడా సహనం కోల్పోయి పోడియం ముందు కూర్చోవడంతో.. చర్చకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో స్పీకర్ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.

అంతకు ముందే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా వరికంకులు చేతబట్టుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ చంద్రబాబు నిరసన ప్రదర్శన చేపట్టారు. అసెంబ్లీలో కూడా అదే విషయంపై ప్రశ్నలు సంధించారు. తుపాను నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరణ ఇస్తున్న సందర్భంగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. మంత్రి సమాధానం చెప్పకుండా అడ్డు తగిలారు.

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతున్న సందర్భంలో.. స్వయంగా చంద్రబాబు అడ్డు తగిలి తనకు మైకు కావాలని అన్నారు. అనంతరం చంద్రబాబు కూడా మిగతా సభ్యులతో కలసి పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

సభలో చర్చ సాగకుండా అడ్డుపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలపై స్వీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. అసెంబ్లీ నుంచి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. చంద్రబాబుతోపాటు బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, అశోక్, పయ్యావుల కేశవ్, సత్యప్రసాద్‌, జోగేశ్వరరావు, బుచ్చయ్య చౌదరి సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు.

సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీఎం జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాలని, సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన కలిగి ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా కూడా పదే పదే అదే అంశాన్ని ప్రస్తావించడం సరికాదని అన్నారు జగన్. సభలో చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి సీనియర్ సభ్యుడు పోడియం ముందు కూర్చోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు జగన్.

మొత్తమ్మీద ఏపీ అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు రసాభాసగా మారాయి. సస్పెన్షన్ల పర్వానికి తెరలేపాయి.