ఏకంగా హీరోనే మార్చేశారు

సీక్వెల్ అనే పదానికి ఇప్పుడు చాలా అర్థాలు వచ్చేశాయి. టైటిల్ అదే ఉంటుంది, లోపల కథ మాత్రం మారిపోతుంది. టైటిల్ పక్కన 2 అంకె తగిలించి సీక్వెల్ అంటున్నారు. లోపల మొత్తం ఓ కొత్త సినిమా చూపిస్తున్నారు. అయితే సీక్వెల్ పేరు చెప్పి ఇలాంటి ఎన్ని ప్రయోగాలు చేసినా.. హీరోను మార్చే ప్రయోగం మాత్రం ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా షురూ అయింది.

అవును.. హిట్ అనే సినిమా సీక్వెల్ లో హీరో మారిపోయాడు. మొదటి సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. కానీ పార్ట్-2కు మాత్రం విశ్వక్ స్థానంలో అడివి శేష్ వచ్చాడు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.

ఇది అసలైన సీక్వెల్. టైటిల్ హిట్-2 అని పెట్టి వేరే కథను చెప్పడం లేదు. హిట్ సినిమా కథ ఎక్కడైతే క్లోజ్ అయిందో, సీక్వెల్ సరిగ్గా అక్కడే మొదలవుతుంది. అంత నిక్కచ్చిగా వస్తున్న సీక్వెల్ ఇది. ఇలాంటి పక్కా సీక్వెల్ లో హీరోను మార్చేయడం నిజంగా ప్రయోగమే. నిర్మాత నాని దీనిపై ఏం చెబుతాడో చూడాలి.