ఫ్యాన్స్ ని మరోసారి నిరాశ పరిచిన తలైవా… అయితే పార్టీ ఏర్పాటు మాత్రం పక్కా

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మరోసారి అభిమానులను నిరాశ పరిచారు. పార్టీ ఏర్పాటుపై ఇవాళ కీలక ప్రకటన చేస్తానని ముందే ప్రకటించిన రజినీకాంత్.. మరోసారి ఎటువంటి ప్రకటన చేయకుండానే అభిమానులను అయోమయంలో పడేసారు.

అభిమానుల పాతికేళ్ళ కోరికమేరకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు మూడేళ్ల కిందట రజనీకాంత్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అయితే తమిళనాడులో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి వస్తారా రారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే మేలని వైద్యులు సూచించడంతో రజనీ రాజకీయ అరంగేట్రం సందిగ్ధంగా మారింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ రజనీకాంత్ చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీ మక్కల్ మండ్రం నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం పై ప్రకటన చేస్తారని అంతా భావించారు. అయితే ఆయన ఎప్పటిలాగే నిర్ణయం త్వరలోనే అంటూ ప్రకటన చేశారు.

అభిమానులతో సమావేశం అనంతరం రజనీ కాంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీ ఏర్పాటుపై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని వెల్లడించారు. పార్టీ ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభిమాన సంఘాల నాయకులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో మక్కల్ మండ్రం నాయకులు తమ లోటు పాట్లను వివరించారని, తన అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నట్టు తెలిపారు.

అయితే జనవరి లో రజనీ కాంత్ కచ్చితంగా పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశంలో రజనీ అభిమానులతో మాట్లాడుతూ జనవరిలో పార్టీ ప్రారంభిస్తే మీరు సిద్ధంగా ఉన్నారా.. అని ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లో నాయకుల పనితీరు ఆశాజనకంగా లేదని, మీరు మరింత కష్టపడితేనే మనం తర్వాతి మెట్టుకు చేరుకోగలమని.. రజినీకాంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి రజనీ పార్టీ స్థాపనకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

బీజేపీతో పొత్తు విషయమై కూడా అభిమానులతో రజనీకాంత్ చర్చించారు. ఆ పార్టీతో పొత్తుకు మద్దతుకు సూపర్ స్టార్ అనుకూలంగా ఉండగా, అభిమాన సంఘాలు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీతో పొత్తు వద్దంటూ అభిమానులు సమావేశ మందిరం లోనే పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. మరో నెల రోజుల్లో పార్టీ ప్రారంభంతో పాటు, బీజేపీతో పొత్తు విషయమై రజనీకాంత్ నిర్ణయం తీసుకోనున్నారు.