హ్యాండ్ బ్యాగ్ … ధర రూ. 53 కోట్లు !

ఒక్క హ్యాండ్ బ్యాగు వెల 53 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజం. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ బోరిని మిలనేసి ఈ బ్యాగుని తయారుచేసింది. దీని తయారీకి వెయ్యిగంటల కాలం పట్టింది.  ఈ బ్యాగు వలన వచ్చిన లాభంలో కొంత భాగాన్ని సముద్ర జలాల ప్రక్షాళన కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వనున్నామని ఆ కంపెనీ తెలిపింది.

ప్రపంచంలో ఎక్కడా ఇంత ఖరీదైన బ్యాగు ఇంతవరకు రాలేదని బోరిని మిలనేసి కంపెనీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది.

https://www.instagram.com/p/CIDwFxZqM77/

‘ఆరు మిలియన్ల యూరోల విలువైన అత్యంత ఖరీదైన బ్యాగుని ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉంది. సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యంపైన, సముద్రాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపైన అవగాహన కలిగించేందుకే దీనిని రూపొందించాము. భూమిలో కలిసిపోని ప్లాస్టిక్… సముద్రాల్లో విపరీతంగా, భయాన్ని కలిగించే స్థాయిలో పెరుగుతోంది. బ్యాగు ద్వారా వచ్చిన సొమ్ములో 800 వేల యూరోలను (సుమారు ఏడు కోట్ల రూపాయలు) సముద్ర జలాల ప్రక్షాళనకు విరాళంగా ఇవ్వబోతున్నాం’ అంటూ తన పోస్టులో  తెలిపింది.

ఇంతకీ ఈ బ్యాగులో ఏముంది… అది అంత వెలువైనది ఎలా అయ్యింది… అనే సందేహం కలుగు తోంది కదా… ఇందులో వజ్రాలను, అరుదైన జెమ్స్ ని పొదిగారు. దీని తయారీకి మొసలి వంటి జంతువు ఎలిగేటర్ చర్మాన్ని వాడారు. బ్యాగుపైన తెల్లబంగారంతో తయారైన పది సీతాకోక చిలుకలను అలంకరించారు. సముద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంపిక చేసిన అరుదైన రాళ్లను సీతాకోక చిలుకల్లో  పొదిగారు. బ్యాగు లోపల పర్యావరణ హితమైన చెట్లనుండి తయారైన లెదర్ ని, కశ్మీర్ ఊలుని వినియోగించారు.