చంద్రబాబు ఆవేశం దేనికి సంకేతం..?

టీడీపీ స్థాపించిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి రికార్డుతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గతంలో తాను ధీటుగా ఎదుర్కొన్న ప్రత్యర్థి కొడుకు చేతులో పరాభవం బాబుని మరింత డీలా పడేలా చేసింది.

ఏడాదిన్నర అవుతున్నా ఆ ఓటమి తాలూకు అసహనం, తన కొడుకు చేతికి అందిరాలేదన్న ఆవేదన ఆయనలో ఇంకా తగ్గలేదు. దీనికి నిదర్శనమే తాజా అసెంబ్లీ సమావేశాలు.

చంద్రబాబులోని ఫ్రస్టేషన్ ఏ రేంజ్ లో ఉందో అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కళ్లకు కట్టింది. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన భాష, ఆయన ప్రవర్తన అందరికీ వింతగా తోచింది. తన రాజకీయ జీవితంలో తొలిసారి ఆయన పోడియం ముందు బైఠాయించి, ఆవేశంతో ఊగిపోయి, చివరకు సస్పెండ్ అయి బైటకొచ్చేశారు.

వరదల్లో రైతులకు నష్టపరిహారం డిమాండ్ చేసే విషయంలో జరుగుతున్న చర్చపై చంద్రబాబు ఆ స్థాయిలో రియాక్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ఆయన పద్ధతి తెలిసినవారందరికీ ఇది ఓ నూతన అనుభవమే.

అసెంబ్లీలోనే అనుకుంటే.. ఆతర్వాత మీడియా సమావేశంలో కూడా అదే ఆవేశం, ఆవేదన చంద్రబాబులో కొట్టొచ్చినట్టు కనిపించింది. “ఏం చంపేస్తారా నన్ను, సభలో వెకిలి నవ్వులు నవ్వుతారా, బీ కేర్ ఫుల్” అంటూ రెచ్చిపోయారు. సభలోకి మూడు న్యూస్ ఛానళ్లను రానివ్వలేదని, తన ప్రతాపం అంతా లైవ్ లో జనాలకు తెలియలేదని తెగ ఇదైపోయారు బాబు.

“అధికారం వచ్చింది కదా అని ఏదైనా చేస్తామంటే కుదరదు, ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటారా, ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వరా, ప్రతిరోజూ అవమానిస్తారా… నా జీవితంలో ఎప్పుడూ లేని తిట్లు తింటున్నా, అవమానాలు భరిస్తున్నా” అంటూ వాపోయారు.

అసలు చంద్రబాబు ఈ స్థాయిలో ఆవేశంతో ఊగిపోతారని ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ సమావేశాలకే హాజరు కారేమో అనుకున్న దశలో.. చేజారిపోతున్న ఎమ్మెల్యేలను గుప్పెట పట్టడానికి అనివార్యంగా అసెంబ్లీకి వచ్చిన బాబు.. ఊహించని రీతిలో అధికారపక్షంపై దాడికి దిగారు. బాబులో ఓటమి భయం, బాధ, అవమానం, ఆవేదన.. ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు అనడానిగి ఇవే ప్రత్యక్ష ఉదాహరణలు.