జేసీకి భారీ పంచ్… అక్రమ మైనింగ్ కు రూ.100 కోట్ల జరిమానా!

టీడీపీ నాయకులు వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొద్ది రోజుల కిందట ఈఎస్ఐ స్కామ్ కేసులో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రికార్డులు మార్చి పాత లారీలను విక్రయించారన్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కి పెద్ద షాక్ ఇచ్చింది. మైనింగ్ గనుల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ ఆయనకు రూ. 100 కోట్ల మేర జరిమానా విధించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు.

త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి జేసీ పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ గుర్తించిన మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించడానికి నిర్ణయించారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు.

అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు లో జేసీ దివాకర్ రెడ్డి తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ ఏర్పాటుకు అనుమతులు పొందారు. ఈ ఫ్యాక్టరీ కోసం పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల లైం స్టోన్ ను ఇష్టానుసారంగా తవ్వుకున్నారని అధికారులు తేల్చారు. అతి విలువైన లైం స్టోన్ ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకోవడంపై అధికారులు జేసీ దివాకర్ రెడ్డి పై అభియోగాలు నమోదు చేశారు.

త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందు తన ఇంట్లోని పని మనుషుల పేర్ల మీద అనుమతులు పొందిన జేసీ ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాటాలను పనిమనుషుల నుంచి తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదకు బదలాయించుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటికే జేసీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని కేసులు నమోదు కాగా ఇప్పుడు అక్రమ మైనింగ్ వ్యవహారం జేసీ తలకు చుట్టుకుంది.

పలుమార్లు పోలీసులతో వాగ్వాదాలకు దిగి, కరోనా నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించడం పై ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు కేసులు ఎదుర్కొంటుండగా ఇప్పుడు జేసీకి రూ.100 కోట్ల జరిమానా విధించాలని మైనింగ్ అధికారులు నిర్ణయించడం సంచలనంగా మారింది.

దీంతో పాటు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో కూడా జేసీ కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్ సంస్థల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. రెండు డోలమైట్ మైనింగ్ క్వారీల్లో నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు జరపడంతో అధికారులు జేసీ కుటుంబీకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే తాడిపత్రి పోలీసులు, జేసీ ఫ్యామిలీ మధ్య కొన్ని రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. పోలీసుల ఆదేశాలను జేసీ ఫ్యామిలీ ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కొద్ది రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి వారి వారసులైన పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తున్నారు.