టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై 2018 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

2014లో కూడా ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. చివరకు ఎట్టకేలకు జానారెడ్డిపై గెలుపొంది సంచలనం సృష్టించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన. కొద్దిసేపటి కిందట హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

నోముల నర్సింహయ్య నాయ్యవాది. సీపీఎం నేతగా ఎదిగారు. ఆ పార్టీ నుంచి నకిరేకల్‌ నుంచి తొలుత ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో నకిరేకల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయింది. దీంతో ఆయన నాగార్జునసాగర్‌కు షిప్ట్‌ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేశారు.

1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జీవితాంతం ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాడారు.