Telugu Global
National

జనంలోకి జనసేనాని... తిరుపతి మూడ్ పసిగట్టడానికేనా...?

కొన్నాళ్లు సినిమా షూటింగ్ లు, ఆ తర్వాత కరోనా కష్టకాలం, తర్వాత చాతుర్మాస దీక్ష.. ఇలా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. కొంత గ్యాప్ తర్వాత జనంలోకి వస్తున్నారు. రేపటి నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. 2వ తేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించే పవన్, ఆ తర్వాత వరుసగా 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తన పర్యటన ఖరారు చేశారు. వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పవన్ వస్తున్నారని పార్టీ […]

జనంలోకి జనసేనాని... తిరుపతి మూడ్ పసిగట్టడానికేనా...?
X

కొన్నాళ్లు సినిమా షూటింగ్ లు, ఆ తర్వాత కరోనా కష్టకాలం, తర్వాత చాతుర్మాస దీక్ష.. ఇలా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. కొంత గ్యాప్ తర్వాత జనంలోకి వస్తున్నారు. రేపటి నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. 2వ తేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించే పవన్, ఆ తర్వాత వరుసగా 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తన పర్యటన ఖరారు చేశారు.

వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పవన్ వస్తున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసినా… తిరుపతి బైపోల్ మూడ్ తెలుసుకోడానికే పవన్ కల్యాణ్ బైటకొస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నివర్ తుపాను రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై ప్రభావం చూపించింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పంట నీట మునిగింది. అటు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కూడా తీరని నష్టం జరిగింది.

అయితే పవన్ మాత్రం నాలుగు రోజుల తన పర్యటనలో మూడు రోజులు.. కేవలం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకే పరిమితం కాబోతున్నారు. అందులోనూ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ పర్యటన సాగేలా ప్రణాళిక రూపొందించారు. తిరుపతి బైపోల్ పై పవన్ గట్టి ఆశలే పెట్టుకున్నారు. గ్రేటర్ లో సీట్లన్నీ బీజేపీకి త్యాగం చేసి, తనకు మాత్రం ఒక్క తిరుపతి పార్లమెంట్ స్థానం కావాలని బీజేపీ అధినాయకత్వాన్ని అభ్యర్థించారు.

ఢిల్లీ భేటీలో గట్టి హామీ లభించకపోయినా పవన్ మాత్రం తన ఆశ వదులుకోలేదు. అందుకే ముందుగానే తిరుపతి పర్యటనకు బయలుదేరారు. 2019 తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికంటే.. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. నేరుగా జనసేన బరిలో దిగిఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వాదన. అందులోనూ పవన్ సామాజిక వర్గం తిరుపతి ప్రాంతంలో బలంగా ఉందని, గతంలో తిరుపతి అసెంబ్లీనుంచి చిరంజీవి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచారని.. ఈ లెక్కలన్నీ తీసుకుంటే.. ఉప ఎన్నికల్లో బీజేపీకంటే జనసేన పేరుతో ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపితేనే ఫలితం ఉంటుందని పవన్ ఆలోచన.

అందుకే ఆయన తిరుపతి మూడ్ తెలుసుకోడానికి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మూడు రోజులపాటు పర్యటించి ఓ అంచనాకి వస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో దఫా బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపి అభ్యర్థిని ఫైనల్ చేస్తారని అంటున్నారు.

మొత్తమ్మీద తాజా పర్యటనతో.. తిరుపతి సీటుపై, జనసేన విజయంపై.. పవన్ భారీగా ఆశలు పెట్టుకున్నారనే విషయం అర్థమైంది.

First Published:  30 Nov 2020 9:30 PM GMT
Next Story