పూజా కార్యక్రమాలతో మొదలైన ఎఫ్-3

ఎఫ్-3 సినిమాకు సంబంధించి ఓ అడుగు ముందుకు పడింది. ఈ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి. సింహాచలం దేవస్థానంలో ఎఫ్-3 స్క్రిప్ట్ కు పూజ జరిపించాడు అనీల్ రావిపూడి. పూజ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలలోనే సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు.

ఈ సినిమాకు సంబంధించి ఓవైపు రెమ్యూనరేషన్ల గొడవ నడుస్తోంది. ఎఫ్2 హిట్టయింది కాబట్టి ఎఫ్3కి వెంకీ రెమ్యూనరేషన్ పెంచాలని సురేష్ బాబు పట్టుబట్టారు. అటు వరుణ్ తేజ్ కూడా చాలా డిమాండ్ చేస్తున్నాడు. ఈ సమస్యల్ని దిల్ రాజు పరిష్కరించినట్టే కనిపిస్తోంది. లేదంటే, ఇలా అనీల్ రావిపూడి స్క్రిప్ట్ కు పూజ చేయడు. బయటకొచ్చి ఈ నెలలోనే షూటింగ్ అని చెప్పడు.

2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. తన బ్యానర్ పై అత్యథిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇదేనంటూ దిల్ రాజు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ కే రిలీజ్ చేస్తానంటున్నాడు అనీల్ రావిపూడి. ఎందుకంటే, అతడి దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది మరి.