వైఎస్సార్ కొడుకుగా చెబుతున్నా… పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదు

పోలవరం ప్రాజెక్ట్ పనుల్ని 70శాతం పైగా తామే పూర్తి చేశామంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఓ కట్టుకథ అని విమర్శించారు సీఎం జగన్.

అసెంబ్లీలో పోలవరం పనుల పురోగతిని ఆయన వివరించారు. 1995-2004 మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం పోలవరం గురించి ఆలోచన కూడా చేయలేదని, 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాకే పోలవరం నిర్మాణ అనుమతుల్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు జగన్. ఎగువ రాష్ట్రాలు తమ ప్రాజెక్ట్ ల ఎత్తు పెంచుతున్నా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

పోల‌వ‌రం కుడి కాల్వకోసం వైఎస్ హయాంలో 10,627 ఎక‌రాలు సేక‌రించి 86శాతం పనులు పూర్తి చేశారని వివరించారు. ఆ పనులు పూర్తి కాబట్టే పట్టిసీమ సాధ్యమైందని, చివరకు అది కూడా టీడీపీ తమ ఖాతాలో జమ చేసుకోవాలని చూడటం విడ్డూరం అన్నారు. కుడికాల్వ పనుల్లో చంద్రబాబు చేసింది కేవలం 14శాతం మాత్రమేనన్నారు.

ఇక ఎడమ కాల్వ విషయానికొస్తే.. వైఎస్ఆర్ హయాంలో 21శాతం పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు హయాంలో 1 శాతం కంటే తక్కువ (0.89 శాతం) పనులు చేశారని అన్నారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీయే చెప్పారని గుర్తు చేశారు జగన్. రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం పనుల్లో రూ.1343కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. డ‌యా ఫ్ర‌మ్ వాల్ కూడా పూర్తి కాని పోల‌వ‌రం ప్రాజెక్ట్ ని ప్రజలకు చూపించ‌డానికి చంద్ర‌బాబు రూ. 83 కోట్లు వృథాగా ఖ‌ర్చు చేశారని విమర్శించారు. తీరా ప్రజల్ని అక్కడకు తీసుకెళ్లి తన పేరుతో భజన కాలక్షేపాలు ఏర్పాటు చేశారని అన్నారు.

జాతీయ ప్రాజెక్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి మూడేళ్లకోసారి అంచ‌నాలను మార్చే అవకాశం ఉన్నా కూడా… 2014 అంచనాల ప్రకారం నిధులివ్వాలని 2018లో చంద్రబాబు ప్రధానిని ఎలా కోరారని ప్రశ్నించారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి బాబు చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు జగన్. బాబు హయాంలో జరిగిన తప్పుల్ని వివరిస్తూ.. కేంద్ర మంత్రుల్ని నిధుల పెంపుదలకు ఒప్పించేలా కృషిచేస్తున్నామని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి ఆర్అండ్ఆర్ కోసం రూ. 26,585 కోట్లు, ప‌వ‌ర్ ప్రాజెక్టు రూ. 4,124 కోట్లు, ఇత‌ర ఖ‌ర్చులకు రూ. 7,174 కోట్లు కావాలని స్పష్టం చేశారు జగన్.  పోల‌వరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వ అంచ‌నాలను కేంద్ర జ‌ల శ‌క్తిసంఘానికి అంద‌జేసి వారిని ఒప్పించామని, ఇదే విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌లిసి వివ‌రించారని చెప్పారు. కేంద్రం మన కష్టాలను సానుకూలంగా విన్నదని అన్నారు జగన్.

చివరిగా పోలవరం ఎత్తు తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా జగన్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా చెబుతున్నా.. పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఎత్తుని అంగుళం కూడా త‌గ్గించే ప్రసక్తే లేదని అన్నారు జగన్. అంతే కాదు.. పోల‌వ‌రం ప్రాజెక్ట్ దగ్గర 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.