Telugu Global
National

తిరుపతి ఉప ఎన్నికపై గ్రేటర్ ప్రభావం ఎంత..?

గ్రేటర్ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం ఒకరకంగా బీజేపీ ఆశలపై నీళ్లు చల్లింది. కేసీఆర్ వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని, ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారని సాక్షాత్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం రూఢీ అవుతోంది. అంటే బీజేపీలో ఎక్కడో ఓ చోట చిన్న అనుమానం ఉందనే మాట వాస్తవం. రేపు ఫలితాలతో ఈ విషయం నిర్థారణ అయితే తిరుపతి ఉప ఎన్నికలపై కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందనేది […]

తిరుపతి ఉప ఎన్నికపై గ్రేటర్ ప్రభావం ఎంత..?
X

గ్రేటర్ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం ఒకరకంగా బీజేపీ ఆశలపై నీళ్లు చల్లింది. కేసీఆర్ వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని, ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారని సాక్షాత్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం రూఢీ అవుతోంది.

అంటే బీజేపీలో ఎక్కడో ఓ చోట చిన్న అనుమానం ఉందనే మాట వాస్తవం. రేపు ఫలితాలతో ఈ విషయం నిర్థారణ అయితే తిరుపతి ఉప ఎన్నికలపై కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందనేది మరింత వాస్తవం.

గ్రేటర్ కంటే ముందు దుబ్బాక ఉప ఎన్నిక జరిగినా.. కేంద్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయిన కారణంగా వచ్చిన ఎన్నికలు, పైగా ఆయన భార్య అదే పార్టీ టికెట్ పై పోటీ చేస్తుండటంతో గెలుపుపై బీజేపీకి ఆశలు లేవు. కానీ దుబ్బాకలో జరిగిన మేజిక్ తో బీజేపీలో ఉత్సాహం రెట్టింపయింది.

అందుకే గ్రేటర్ ఎన్నికలకోసం ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ తరలి వచ్చారు. అయితే అక్కడ బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదనే విషయం తేలిపోయింది. పోలింగ్ సరళిని బట్టి, గ్రేటర్ ప్రజలు పెద్దగా మార్పు కోరుకోవడంలేదని తెలుస్తోంది. దీంతో ఆ ప్రభావం తిరుపతి ఉప ఎన్నికపై పడే అవకాశం కూడా ఉంది.

గ్రేటర్ లో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థానాలు వస్తే.. తిరుపతి సీటుని ఆ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నయానో, భయానో పవన్ కల్యాణ్ కు నచ్చజెప్పి, విస్తృత ప్రయోజనాలకోసం అక్కడ కూడా బీజేపీయే పోటీ చేస్తుంది. ఒకవేళ గ్రేటర్ లో బీజేపీకి చావుదెబ్బ తగిలితే.. కచ్చితంగా పవన్ కల్యాణ్ ఎదురు తిరిగే అవకాశం ఉంది. తిరుపతి సీటుని డిమాండ్ చేసి మరీ జనసేనాని సాధించుకునే అవకాశం ఉంది.

అంటే గ్రేటర్ ఫలితం ఆధారంగానే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారవుతారనే విషయం తేలిపోయింది. ఒకవేళ హైదరాబాద్ లో తక్కువ సీట్లు వచ్చి, తిరుపతిలో బీజేపీ పోటీ చేసినా.. ప్రచారం విషయంలో మాత్రం అక్కడ జరిగినంత హడావిడి ఇక్కడ కనిపించదు. ఎందుకంటే.. వ్యవసాయ బిల్లులు సహా పలు విషయాల్లో తమకు మద్దతిచ్చిన ఏపీ సర్కారుపై కేంద్రం నేరుగా ఎదురు దాడికి దిగే సాహసం చేయదు.

కేంద్ర మంత్రులు కేసీఆర్ ని విమర్శించినంత జోరుగా, జగన్ పై నిందలు వేయలేరు. ఒకరకంగా ప్రచారం అంతా రాష్ట్ర బీజేపీ నాయకత్వమే భుజానికెత్తుకునే అవకాశం ఉంది. జగన్ సర్కారుని విమర్శించడానికి పవన్ ఉండనే ఉన్నారు.

అందుకే ప్రచార పర్వంలో బీజేపీ పెద్ద తలకాయలు కనిపించడం కద్దు. ఒకరకంగా తిరుపతి అభ్యర్థితోపాటు, ప్రచార సరళిని కూడా గ్రేటర్ ఫలితాలు డిసైడ్ చేయబోతున్నాయి.

First Published:  2 Dec 2020 9:01 PM GMT
Next Story