ఒంటరిపోరే..! కమల్​ నిర్ణయం… హ్యాండ్​ఇచ్చిన కాంగ్రెస్​, లెఫ్ట్​

తమిళనాడులో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించడంతో ఆ రాష్ట్రంలోని పార్టీలు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. కాగా భావసారుప్యత కలిగిన పార్టీలు కలసిరాకపోతే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని మక్కల్​నీది మయ్యం పార్టీ అధినేత కమల్​హాసన్​ నిర్ణయం తీసుకున్నారు.

రజనీ కాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కమల్ చూసినా ఆయన బీజేపీతో దోస్తీ కట్టే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కనీసం కాంగ్రెస్​, కమ్యూనిస్టు పార్టీలు అయినా కలిసి వస్తాయని కమల్ భావించారు. కానీ ఆ పార్టీలు డీఎంకేతోనే పొత్తు సాగుతుందని స్పష్టం చేయడంతో ఇక ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని కమల్​ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 234 స్థానాల్లో పోటీచేయాలని మక్కల్​నీదిమయ్యం భావిస్తోంది. పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమల్​ త్వరలో తమిళనాడు వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీనాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవలే పార్టీ ముఖ్యులతో కమల్ సమావేశమయ్యారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగసభలు, రోడ్​షోలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సోషల్​మీడియా టీంను కూడా పటిష్ఠపరిచే చర్యలు చేపట్టారు. దీని ద్వారా పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్​డేట్లు అందించనున్నారు.

మరోవైపు కమల్​ రాష్ట్ర పర్యటన కోసం ఓ భారీ వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనంలోనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నారు. ఈ వెహికల్​లో అన్ని సౌకర్యాలు కల్పించారు. బస్సులో ఓ లిఫ్ట్ ఏర్పాటుచేసి దానికి సీట్ సెట్ చేశారు. సభ నిర్వహించే సమయంలో ఆ లిఫ్టు సాయంతో బస్సు పైభాగానికి చేరుకుని ప్రసంగించే లా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి రెడ్​కలర్​ వాహనాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనల ప్రకారం.. పర్యటనలు కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. కమల్​ హాసన్​ పర్యటన వివరాలను త్వరలోనే ఆ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నది.

తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్​ అధికారి సంతోష్​బాబు.. ఇటీవల మక్కల్ నీది మయ్యం పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అనేకమంది మాజీ అధికారులు, లాయర్లు, డాక్టర్లు కమల్​పార్టీ తరఫున పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.