రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తా – పవన్ కల్యాణ్

కరోనా కష్టకాలంలో హైదరాబాద్ కే పరిమితమైన పవన్ కల్యాణ్, నివర్ తుపాను తర్వాత హఠాత్తుగా ఏపీకి రావడం, రైతు పరామర్శ యాత్రను ప్రారంభించడం.. తిరుపతి ఉప ఎన్నికల స్టంట్ గా కొందరు కొట్టిపారేస్తున్నా జనసేనాని మాత్రం తన దూకుడు చూపిస్తున్నారు.

వ్యవసాయ బిల్లు రద్దుకోరుతూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనల గురించి పల్లెత్తు మాట మాడ్లాడని జనసేనాని.. ఏపీలో రైతు ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తాననడం హాస్యాస్పదం అని విమర్శలు వినిపిస్తున్నా.. పవన్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. కౌలు రైతుల తరపున తాను పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు.

నాలుగు రోజుల రైతు పరామర్శ యాత్రను అట్టహాసంగా మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ తొలిరోజు రెండు జిల్లాల రైతులతో నేరుగా పొలాల్లోనే మాట్లాడారు. రోడ్ షోలతో ఆకట్టుకున్నారు. చివరిగా వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. పనిలో పనిగా తెలంగాణ సర్కారుపై ప్రేమను చూపించారు.

హైదరాబాద్ లో వరదలొస్తే కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి 10వేలు ఇచ్చి ఆదుకుందని, ఏపీలో మాత్రం ఒక్క ఎకరాకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు పవన్ కల్యాణ్. ముఖ్యంగా కౌలు రైతుల ఇబ్బందులు ఎవరూ పట్టించుకోవడంలేదని, భూ యజమానులతో పాటు, కౌలు రైతులకి కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరాకి రూ.25వేలు ఇవ్వాలన్నారు పవన్.

48గంటల డెడ్ లైన్…

వైసీపీ పాలనలో రైతులందరికీ న్యాయం జరగడంలేదని విమర్శించిన పవన్, 48గంటల్లో తక్షణ సాయం కింద రూ.10వేలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద నష్టం అంచనా వేసిన తర్వాత ఎకరాకి 25వేలనుంచి 30వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

రైతులకు పరిహారం పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని, దానికి తానే నాయకత్వం వహిస్తానని హెచ్చరించారు జనసేనాని. రైతులకు అండగా ఉంటామని.. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామని రైతులకు భరోసా కల్పించారు.

రైతు సమస్యలు వదిలేసి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయని మండిపడ్డారు పవన్. రైతులకు ఎలా న్యాయంచేయాలనే విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

మొత్తమ్మీద తొలిరోజు పర్యటనలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో విమర్శలు ఎక్కు పెట్టారు. నష్టపరిహారంతో మొదలు పెట్టి, తెలంగాణతో పోలిక పెట్టి, ఏపీలో రైతు ఉద్యమం మొదలు పెడతానని హెచ్చరించారు.