ప్రభాస్ నుంచి మరో ఇండియన్ మూవీ

హోంబలే ఫిలింస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. ఈ బ్యానర్‌లో రాకింగ్‌స్టార్ య‌ష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మ‌రో ప్యాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విడుద‌ల గురించి ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ అధినేత విజయ్‌ కిరగందూర్… ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తన బ్యానర్‌లో మూడో ప్యాన్ ఇండియా మూవీగా ‘సలార్’ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ లో తుపాకీ పట్టుకొని రాజసంగా కూర్చున్నాడు ప్రభాస్.

వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమౌతుందని స్వయంగా ప్రభాస్ ప్రకటించాడు. అంతేకాదు.. రాధేశ్యామ్ తర్వాత థియేటర్లలోకి వచ్చేది ఈ సినిమానే. ఈ మూవీ తర్వాతే ఆదిపురుష్, నాగఅశ్విన్ సినిమాలు వస్తాయన్నమాట. ‘సలార్’ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ చేయబోతున్నారు.