సమరానికి సై… పార్టీ పెడుతున్నట్లు రజనీ కాంత్ ప్రకటన

అభిమానుల పాతికేళ్ల నిరీక్షణ ఫలించింది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ ఆరంగేట్రం ఖరారైంది. జనవరిలో కొత్త పార్టీ పెడుతున్నట్లు రజనీ కాంత్ కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 31న పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

పార్టీ ఏర్పాటుపై కొద్దిరోజులుగా రజనీ కాంత్ మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు పార్టీ పెట్టాలా.. వద్దా.. అని తర్జన భర్జన పడుతూ వచ్చారు. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి వెళ్లక పోవడమే మంచిదని వైద్యులు సూచించడంతో రజనీకాంత్ అసలు రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే చర్చలు జరిగాయి. ఆయన కూడా ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం రజనీ మక్కల్ మండ్రం నేతలతో ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించారు.

తాను రాజకీయాల్లోకి రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానని రజనీకాంత్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీ కాంత్ వారం కిందట మక్కల్ మండ్రం నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. తన రాజకీయ ప్రవేశంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజకీయాలపై తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకున్నారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల పార్టీ పెడితే సమర్థవంతంగా ఎదుర్కోగలరా.. అని మక్కల్ మండ్రం నేతలతో ఆరా తీశారు. అభిమానులతో సమావేశం ముగిసిన తర్వాత రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం పై త్వరలోనే నిర్ణయం తీసుకొని చెబుతానని ప్రకటించారు.

ఇప్పటికే పలుసార్లు రాజకీయాలపై ప్రకటన చేసి ఆ తర్వాత ఎటూ తేలకపోవడంతో రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందో లేదోనని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇవాళ ట్విట్టర్ వేదికగా తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు.

జనవరిలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో రజనీ రాజకీయ ప్రవేశంపై ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు ‘తలైవా వస్తున్నాడంటూ’ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకొంటున్నారు.

కాగా పార్టీ పేరు, గుర్తు, పార్టీ సిద్ధాంతాలపై తీవ్ర కసరత్తు చేసిన అనంతరం పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.